హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): ఇజ్రాయిల్ దేశం పాలస్తీనా, ఇరాన్‌పై జరిపే యుద్ధాన్ని తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయమైన ఎంబీ భవన్లో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షత వహించారు. 20 నెలలుగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ నిరంతర బాంబు, వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తున్నదని, ఇప్పటికే దాదాపు 50 వేల మంది మరణించారని, మౌలిక వసతులను కొల్లగొట్టిందని వామపక్ష నేతలు విమర్శించారు. పాలస్తీనా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా నిలవాలని, ఇజ్రాయిల్‌తో అన్ని సైనిక, భద్రతా సహకారాన్ని వెంటనే నిలిపివేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. సమావేశంలో పశ్య పద్మ (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్ధన్ (సీపీఐఎంఎల్), రమేశ్‌రాజా (సీపీఐ లిబరేషన్), మురహరి (ఎవయూసీఐ(సీ) పాల్గొన్నారు.