హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయలేరా? ప్రమాదంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వెంటనే చర్యలు చేపట్టి, అందుకు సంబంధించిన నివేదికను నాలుగు వారాల్లో అందజేయాలని ఆదేశించింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలిపోయిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కి మరణించగా, ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మిగిలిన ఆరుగురు కార్మికుల అచూకీ అంతుచిక్కలేదు. ప్రభుత్వం సైతం చేతులేత్తిసింది. కార్మికుల జాడ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ను నిలిపిసేంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయడంలో, బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ పిటిషన్పై జాతీయ మానవ హకుల కమిషన్ శుక్రవారం విచారించింది. సొరంగంలో గల్లంతైన కార్మికులను వెలికితీయలేరా? ప్రమాదంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కార్మికులను వెలికితీసే విషయంలో తక్షణం స్పందించాలని, నాలుగు వారాల్లో చర్యలు చేపట్టి అందుకు సంబంధించిన నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించింది. సొరంగంలో గల్లంతైన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందచేయాలని పేర్కొంది.