హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(టీఎన్జీవో) మండిపడింది. సీఎం, మంత్రుల ఆదేశాలను కూడా వారు పాటించడంలేదని సంఘం ఆరోపించింది. ఇప్పటికైనా తీరు మార్చుకుని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే సదరు అధికారులను ఉద్యోగ వ్యతిరేకులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలోని టీన్జీవో భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారంకాకపోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇంత నిర్లక్ష్యమా? అంటూ ప్రశ్నించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం 22 నెలలుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక పర్యాయాలు సీఎం, మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల కమిటీతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపినప్పటికి, ఇంకా పెండింగ్‌లో ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు ప్రతి నెలా రూ. 700కోట్ల చొప్పున చెల్లిస్తామని చెప్పి, తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హెల్త్‌కార్డుల హామీ కూడా అటకెక్కిందని, ఐదు డీఏలు అడిగితే కేవలం ఒకే డీఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ మాటెత్తకపోవడం విడ్డూరమని తెలిపారు. సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యానారాయణగౌడ్, పలు జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. అనంతరం పూర్వ రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కే లక్ష్మణ్, సంధ్య అశోక్‌ను ఘనంగా సన్మానించారు.
ప్రధాన డిమాండ్లు..