KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకున్న సమాచారం మేరకు 15లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్. పంటలు ఎండని జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య పంటలు ఎండిపోతున్నయ్. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిలో ఎండుతున్నది. ఇవాళ రైతులు చెబుతున్న లెక్క. ప్రతి ఊరికి 200-300 ఎకరాలు ఉండుతున్నది. సూర్యాపేటలో 20-24వేల ఎకరాలు ఎండుతున్నది. భయంకరంగా సాగర్ ఆయకట్టులో భయంకరంగా పంట ఎండిపోయింది’ అన్నారు.
‘ఏం కారణం చేత సాగర్ ఆయకట్టులో ఎండపెట్టారు. ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఎండీడీఎల్ కంటే ఎక్కువగా 7టీఎంసీల నీళ్లు ఎక్కువ ఉన్నయ్. ఎండీడీఎల్ కింద కూడా వాడుకోగలిగిన 7 టీఎంసీల నీళ్లు వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆ నాడు బోడముండ కేఆర్ఎంబీ ఉండే. కేఆర్ఎంబీ అంటే సూపర్ బాసా? వాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడుమనకేం బాస్ కదా. మొత్తం ప్రాజెక్టును తెలివితక్కువగా అప్పజెప్పి.. కేంద్రమంత్రి తియ్యగా పుల్లగా మాట్లాడితే.. కేఆర్ఎంబీ చేతుల్లో అధికారం పెట్టి ఇవాళ నాగార్జున సాగర్ కట్టమీదికి పోలేని దుస్థితిని తీసుకువచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరిది? ఎప్పుడూ మమ్ముల్ని కూడా కేఆర్ఎంబీ నిరోధించేది. మేం వాళ్లను దటాయించేది. మా కంటే ఆంధ్రా ఎక్కువ తీసుకున్నది.. మాకు ఇవ్వాలి అని తూములు లేపి మూడునాలుగు తడులు ఇచ్చేది. ఎనిమిది పంటలు నాగార్జున సాగర్ కింద ఎకరం ఎండకుండ పండించాం. ఇవాళ లక్షల ఎకరాల్లో సాగర్ ఎందుకు ఎండింది’ అన్నారు.
‘చిల్లర కాయకొరుకుడు మాటలు.. పూటకో పీఆర్ స్టంట్ పెట్టి.. లంగా ముచ్చట్లు ప్రచారం చేసి.. ప్రజలు పట్టరా? రాజకీయాలు తర్వాత మస్తుగ చేద్దాం. మేం కూడా గద్దెలెక్కినం. పది సంవత్సరాలు పరిపాలన చేశాం. అదేం గొప్ప విషయం కాదు. అధికారం వస్తుంది పోతుంది. కానీ ప్రజలు ఎక్కడికి పోవాలి ? నీ రాజకీయం.. నా రాజకీయం అంతా ప్రజలు కదా? ముఖ్యంగా రైతాంగం.. గ్రామాలు కదా? పట్టుగొమ్మలుగా ఉన్న పల్లెసీమల్లో ఇవాళ బోరుబండ్ల హోరు వినిపిస్తుంది. గత ఎనిమిదేళ్లలో బోరుబండ్లు కనిపించలేదు. కరెంటు మోటార్లను వైండింగ్ మళ్లీ చేస్తున్నరు. తెలంగాణ నుంచి జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు పారిపోయాయి. ఇన్వస్టర్లు, కన్వర్టర్లు అమ్ముకునే దుకాణాలు దివాళా తీశాయి. మళ్లీ అవసరి కొనే దుస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రంలో’ అంటూ మండిపడ్డారు.