Child Rights | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): అర్హత లేని ఓ మహిళా నేతకు రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించనున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్రా మూలాలున్న మహిళను అందలమెక్కించనున్నారా? సామాజిక సేవతో సంబంధంలేని, పూర్తిగా రాజకీయ నేపథ్యమున్న వ్యక్తిని నియమించనున్నారా? అనే ప్రశ్నలకు ఆవుననే సమాధానం వస్తున్నది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ఒకటి, రెండ్రోజుల్లో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఆమె నియామకంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర అధికార పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తున్నది.
సాధారణంగా కనీసం ఏడేండ్లు సమాజాభివృద్ధి, బాలల అభ్యున్నతికి కృషిచేసి 35 ఏండ్లు నిండిన వ్యక్తులకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించాల్సి ఉంటుంది. గతంలో రాజకీయ నేపథ్యమున్నవారికి ఈ పదవిని అప్పగించేందుకు యత్నించగా కోర్టులు అభ్యంతరం చెప్పాయి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తున్నది. గతంలో దక్షిణ తెలంగాణలోని ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ఫక్తు రాజకీయ నేతను ఈ సీట్లో కూర్చోబెట్టేందుకు సంసిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్, ఆరుగురు సభ్యుల నియామకానికి ప్రభుత్వం జనవరి 31, 2024న నోటిఫికేషన్ ఇచ్చింది. సమాజసేవ, బాలల హక్కుల కోసం కృషి చేసినవారు అర్హులని వెల్లడించింది. ఈ క్రమంలో సుమారు 450 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. అయితే, ప్రభుత్వ పెద్దకు అనుకూలమైన నాయకురాలు ఎంపిక జాబితాలో కనిపించలేదు. దీంతో నవంబర్ 25, 2024న మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సదరు మహిళా నేత దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్న ప్రభుత్వ పెద్ద చకచకా పావులు కదిపారు.
కీలక పదవి ఎంపిక విషయంలో అధికార పార్టీలోనూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతకాలం కిందటే పార్టీలో చేరిన నాయకురాలు పార్టీ కోసం చేసిందేమీలేదని చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఓ వైపు కోర్టు కొట్టేస్తుందనే భయం, పార్టీలోనూ భిన్నస్వరాలు వినిపిస్తుండడంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యం కానున్నట్టు పలువురు నాయకులు ఈ మేరకు చెబుతున్నారు.