హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి తప్పదని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారా? అందుకే స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో రాజీనామా చేయించేందుకు వెనుకాడుతున్నారా? కేసీఆర్ రంగంలోకి దిగితే అడ్డంగా బుక్కయిపోతాననే భయంతో వణికిపోతున్నారా? అనే ప్రశ్నలకు రాజకీయవర్గాల్లో అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి కేసీఆర్ అంటే భయంపోలేదు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాను, కేసీఆర్‌ను మరిపిస్తాను అని బయటకు చెప్పుకోవడమే కానీ.. కేసీఆర్ అంటే రేవంత్‌రెడ్డి జడుసుకుంటున్నారని అందరికీ తెలిసిందే.
రెండేండ్ల ఆనవాళ్లు ఏంటో చెప్పకుండా రాద్ధాంతం చేయడంతో ఫలితాలు రాబోవని స్పష్టంచేశారు. అందుకే ఉపఎన్నికలంటేనే రేవంత్ జంకుతున్నారు అంటూ రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున అసెంబ్లీలో అడుగుపెడతానని కడియం ప్రతిపాదనను రేవంత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు సమాచారం. ఉపఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే పర్యవసానాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. కేసీఆర్ రంగంలోకి దిగితే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని భావించే.. కడియం రాజీనామాకు సీఎం నిరాకరించినట్టు వినికిడి. ఎన్నికల్లో గెలుపుపై రేవంత్‌రెడ్డికే ఎక్కువ భయం పట్టుకున్నదని కాంగ్రెస్ వర్గాల్లోనే కొందరు చెప్తున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్ గురించే పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ముచ్చటించిన సందర్భంలో ఉప ఎన్నికలకు రేవంత్ భయపడుతున్న విషయం పరోక్షంగా వెల్లడించారు. సమావేశాల వేదికలపై కాంగ్రెస్ ఫ్లెక్సీ పెట్టుకొని బీఆర్ఎస్లో ఉన్నాననడం రాజకీయాల్లో భాగమేనని కడియం చెప్పుకొచ్చారు. క్రియాశీల రాజకీయాల్లో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి అనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ధైర్యం చేయడంలేదనే అంశాన్ని చెప్పకనే చెప్పారని మీడియావర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఫిరాయింపుదారులతో రాజీనామాకు జంకుతున్న రేవంత్, పైకి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు.