హైదరాబాద్: ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి ఏసీబీ కార్యాలయానికి వచ్చా. కానీ రాజ్యాంగ బద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీపీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే లీగల్ టీమ్‌తో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు కేటీఆర్‌ను రోడ్డుపైనే అడ్డుకున్నారు. సుమారు 45 నిమిషాలపాటు అక్కడే ఉంచారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నా లాయర్‌ను నాతో రావద్దని చెబుతున్నారు. నా లాయర్‌ను వెంటపెట్టుకుని విచారణకు వచ్చే అధికారం ఉందని అనుకుంటున్నా. భారత రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నా. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుందని వాళ్లు అంటున్నారు. గతంలో తమ పార్టీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ను మీడియాకి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది. పోలీసులు నమ్మను. రాజమౌళి కంటే బాగా పోలీసులు స్క్రిప్టులు రాస్తున్నారు.
హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేశాక నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదు. అయినా ఇవాళ ఏసీబీ ఆఫీస్‌కు రమ్మన్నారు. నన్ను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉంది. గతంలో ఒక మంత్రిగా ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకున్నా. నావద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారు. అపోహ పడుతున్న సమాచారం అంతా ప్రభుత్వం వద్దే ఉంది. నా వాదన ఇప్పటికే కోర్టులో చెప్పా. కోర్టు తీర్పు రిజర్వు చేసింది. హైకోర్టు, చట్టాలు, రాజ్యాంగంపై గౌరవంతో ఏసీబీ ఆఫీసుకు వచ్చా.
అయినా తన వెంట న్యాయవాదులు ఉంటే ఈ ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలి. లేదా ఒక పౌరుడిగా తనకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి. ప్రస్తుతం విచారణ పేరుతో నన్ను ఇక్కడికి పిలిచి… నా ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర కూడా జరుగుతుంది. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదు. రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కోత విధించి చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ కుట్ర. ప్రజాక్షేత్రంలో రేవంత్‌ను వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్లు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. నాకు ఏసీబీ ఇచ్చిన నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు వచ్చాను . అయితే కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా, లాయర్‌తో విచారణకు హాజరు కావడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి కేటీఆర్ వెనుతిరిగారు. తన స్పందనను రోడ్డుపైనే ఏసీబీ అధికారులకు అందించారు.
ఏసీబీ కార్యాలయం వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని అడ్డుకున్న పోలీసులు
✳️మీడియాతో కేటీఆర్ కామెంట్స్:
✳️చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను.
✳️కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తుంది.… pic.twitter.com/LFtFNTLvnm
— BRS Party (@BRSparty) January 6, 2025