KTR | ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. అయితే పోలీసులు లేదంటే మీ గుండాలను ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయాలంటే బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లు, దాడులు, కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆనాటి ఎమర్జెన్సీని అప్రకటితంగా అమలు చేయటమేనా అని ప్రశ్నించారు.
ఇలాంటి తాటాకు చప్పళ్లకు తెలంగాణా భయపడదని కేటీఆర్ స్పష్టం చేశారు. గుర్తు పెట్టుకో మిస్టర్ చీ(ప్)ఫ్ మినిస్టర్…ఎంత అణిచివేస్తే అంత ఎదురు తిరుగుతామని హెచ్చరించారు. ఏడాది కూడా తిరగకముందే ఇంత ఫ్రస్ట్రేషనా? అని ప్రశ్నించారు. ఇది ఆరంభమే అని ముందున్నది ముసళ్ల పండగ అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ పై ప్రశ్నిస్తేనే బెదిరిపోతున్నారు, భయపడుతున్నారని.. ఇంకా మీ ఆరు గ్యారంటీలు…420 హామీల గురించి అడిగితే ఏమైపోతారో అని ఎద్దేవా చేశారు.
పరిపాలన అంటే పచ్చి బూతులు, పిచ్చి మాటలు అనుకున్నావా అని కేటీఆర్‌ను నిలదీశారు. పూర్వాశ్రమంలో ప్రవర్తించినట్లే ప్రవరిస్తే అందలమెక్కించటానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు… తెలంగాణ అని అన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజలు నిన్ను వదలరని అన్నారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటదని.. వెంటాడుతది.. వేటాడుతదని స్పష్టం చేశారు.
ఈ దాడులు, దౌర్జన్యాలు, కేసులు, బెదిరింపులు బీఆర్ఎస్ కు కొత్త కాదని కేటీఆర్ అన్నారు. నీకన్నా తీస్ మార్ ఖాన్ లే ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆగమైపోయిన్రు అని రేవంత్ రెడ్డికి గుర్తుచేశారు. కాంగ్రెస్ కు ఇచ్చిన హానీమూన్ సమయం అయిపోయిందని తెలిపారు. ఇక ప్రజా క్షేత్రంలో మిమ్నల్ని కడిగేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఇంకా కేసులే పెట్టుకుంటావో…తల పట్టుకుంటావో ఛాయిస్ నీకే అని తెలిపారు. అధికార పక్షమైనా…ప్రతి పక్షమైన ప్రజల కోసం తమ పోరాటం మాత్రం ఆగదని పేర్కొన్నారు.