రంగారెడ్డి, మే 31 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం… కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం. కానీ కొనితెచ్చుకున్న రేవంత్రెడ్డి మాకు కొత్త కష్టాలు తీసుకువస్తడనుకోలేదు అని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
వివరాల్లోకి వెళ్తే ఇర్విన్ గ్రామంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రిజర్వాయర్ ప్రతిపాదనలను రద్దుచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ భూములను తమకు ఇప్పించాలని కోరుతూ రైతులు శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1,070 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నదని, అధికారులు రాత్రిపూట డ్రోన్లతో సర్వేలు చేస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.
రహస్య సర్వేల ద్వారా అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వాయర్ ఏర్పాటును రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఇర్విన్ గ్రామంలో భూమి మార్కెట్లో ఎకరానికి రూ.కోటి ధర పలుకుతున్నదని, ప్రభుత్వం మాత్రం ఎకరానికి రూ.8లక్షలు ఇస్తామని చెప్తున్నదని వాపోయారు. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని స్పష్టంచేశారు. రిజర్వాయర్ ఏర్పాటు వలన రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని, భూస్వాములకు, ముఖ్యమంత్రి బంధువులకే ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భూమికి బదులుగా భూమి లేదా మెరుగైన పరిహారం ఇస్తేనే భూసేకరణకు అంగీకరిస్తామని స్పష్టంచేశారు.
మేం భూములను నమ్ముకుని బతికేటోళ్లం. కానీ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసమో మా భూములను తీసుకుంటే ఎలా బతకగలం. కూలీనాలీ పనులకు వెళ్లలేని పరిస్థితి వస్తుంది. భూములు లేకపోతే పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేయలేం. మా ఊరి ప్రక్కన ఉండే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే, మా గ్రామాన్ని ఆదుకుంటాడని అనుకున్నాం. కానీ మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేశాడు. మా గ్రామంలో రిజర్వాయర్ ఏర్పాటును రద్దుచేయాలి. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాల్సిందే
-నర్సమ్మ, ఇర్విన్ గ్రామరైతు