Telangana | ధర్పల్లి, ఫిబ్రవరి 22 : పదేండ్లు ఆనందంగా ఉన్న రైతన్న నేడు ఆందోళన చెందుతున్నాడు. ఏడాదికాలంగా ఆగమవుతున్నాడు. పంటకు చివరి తడులు అందక అల్లాడిపోతున్నాడు. వరి వేసిన నేల నీరందక నెర్రెలు బారి పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక రైతు గుండె తరుక్కుపోతున్నది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పంటను రక్షించుకోలేక ఎండిన పంటను చూస్తూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో యాసంగి పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగులుతున్నది. రోజురోజుకూ భూగర్భజల వనరులు అడుగంటి పోతుండటంతో పంటలు సగానికి సగం ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డు వాడీ, హోన్నాజీపేట్ గ్రామాల పరిధిలో, దుబ్బాక, గోవిందుపల్లి గుడి తండా గ్రామాల పరిధిలో వరికి నీరందక ఎండిపోతున్నాయి.
గతంలో చివరి తడులకు నీరందక ఎండిపోయే పరిస్థితులు వస్తుండే.. కానీ ప్రస్తుతం చివరి తడుల కన్నా ముందుగానే పంటలకు నీరందక ఎండిపోవడం ఇదే మొదటిసారని రైతులు ఆవేదన చెందుతున్నారు. చివరి తడులు మార్చి, ఏప్రిల్ వరకు అందక ఎండిపోతుండే. కానీ ఫిబ్రవరిలోనే భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. బోర్లలో నీరు రాక వేసిన పంటలను రక్షించుకోలేక సగం పంటను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. మిగతా సగం పంటలకే నీళ్లు పట్టిస్తూ కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
నడిమి తండా పరిధిలోని ముత్యాల వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు వెళ్లగా నడిమి తండా వాసులు అడ్డుకొన్నారు. వారం రోజులైన సమస్య కొలిక్కిరాకపోవడంతో శుక్రవారం ఇరిగేషన్ ఏఈ రాంప్రసాద్ పోలీసుల రక్షణతో ముత్యాల వాగు ప్రాజెక్టు నుంచి లక్ష్మీ చెరువు తండా, ఊర చెరువుకు నీటిని విడుదల చేయడం గమనార్హం.