నర్సింహులపేట, ఫిబ్రవరి 26 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఎస్సారెస్పీ కాల్వలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. మండుతున్న ఎండలకు కాల్వ తడవడం వరకే సరిపోతున్నది. చెరువుల్లోకి సాగునీరు వచ్చే అవకాశం లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోవడం, బోర్ల నుంచి నీళ్లు ఆగిఆగి రావడం.. యాసంగికి పెట్టుబడి సాయం రైతు భరోసా అందక పోవడం, వరి పైరు కండ్ల ముందే ఎండిపోతుండంతో ఏమి చేయాలో రైతులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది.
వరి పైరు ఎండిపోకుండా ఉండేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి బావుల్లో పూడికతోపాటు క్రేన్ సహాయంతో లోతు తవ్విస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదని, కాల్వల్లో నీరు రావడంలేదని, పెద్ద కాల్వలో వారం వస్తే మరో వారం నీరు రాక పోవడంతో వచ్చిన నీరు చిన్న కాల్వకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఐదేళ్లుగా బావి, బోరులో నీరు తగ్గిందిలేదు. పంట ఎండింది లేదు. కాల్వల్లో ఎప్పుడు చూసినా నీరు వచ్చేది. ఈ యాసంగి సాగుకు నీళ్లు ఇస్తామన్నారు. పెద్ద కాల్వలో నీరు వస్తే చిన్న కాల్వకు రావడం లేదు. పెద్ద కాల్వకు వారం విడిచి వారం నీళ్లు ఇస్తున్నారు. బోరు ఆగిఆగి పోస్తాంది. కాల్వకు నీళ్లు రావడం లేదు. వరి వేసి రెండు నెలలైంది. ఇప్పుడే పంటకు నీరు అందక ఇబ్బంది అవుతుంది. ఇంకా నెల రోజులు పంటకు నీళ్లు పెట్టుడు ఇబ్బందిగానే ఉన్నది.
-బానోతు బాలాజీ చింతల్తండా