Revanth Reddy | వికారాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): నిధుల మంజూరులో వివక్ష చూపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సాగునీటి విషయంలోనూ అదే వ్యత్యాసం చూపుతున్న విషయం తేటతెల్లమైంది. కేవలం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కే ప్రాధాన్యమిస్తున్నారని తేలిపోయింది. ఇదే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది.
మొదటి నుంచి కేసులేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అడగడుగునా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు.. అధికారంలోకి వచ్చాక కూడా తుది దశకు చేరిన ఆ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా పక్కనబెట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి కొడంగల్ నియోజకవర్గానికి సాగు నీరందిస్తామని చెప్పారు. దీంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు సాగునీరు ఇక రాదని సీఎం తేల్చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా పక్కనే ఉన్న పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు సీఎం వ్యాఖ్యలపై కిమ్మనకపోవడం గమనార్హం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గోదావరి జలాలను తీసుకొస్తామని కాలయాపన చేస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఖర్చు చేసి దాదాపు 90% వరకు పనులు పూర్తి చేసింది. 29 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 10 శాతం పనులను కావాలనే పక్కన పెట్టడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం కొడంగల్ నియోజకవర్గంతోపాటు సీఎం సొంత జిల్లాపై ప్రేమతో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఏడాదిలో సాగునీరొచ్చి.. తమ ప్రాంతం పచ్చబడుతుంది, బతుకులు మారుతాయని ఆశించిన వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ప్రజల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెస్ అధికారం చేపట్టాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల కోసం నయాపైసా ఖర్చు చేయకపోవడంతో ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అన్ని ఉమ్మడి జిలా ్లకేంద్రాల్లో నైపుణ్య శిక్షణాభివృద్ధి కోర్సులతో మైనారిటీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
90 శాతం పూర్తయిన పనులు
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం వరకు పూర్తయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీడుబారిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరందించి ప్రజల దశాబ్దాలనాటి కలను నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టి రూ.27 వేల కోట్లను ఖర్చుచేసింది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాగా, కేవలం సాగునీరందించేందుకు కాల్వల పనులు మాత్రమే చేయాల్సి ఉన్నది. ఇందుకు అవసరమైన నిధులనూ అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదిలో సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తీవ్ర నిరాశే మిగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేశారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు 2 వేల హాబిటేషన్ల వరకు తాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. గత ప్రభుత్వం కాల్వల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1,000 చెరువుల వరకు నీటిని నింపేందుకూ ప్రభు త్వం ప్రణాళికలు రూపొందించింది.