హైదరాబాద్, జూలై25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధుల కోత విధించింది. గత సంవత్సరం కంటే ఈ బడ్జెట్లో రూ.4,584 కోట్లు తగ్గించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మేజర్, మీడియం, మైనర్ సాగునీటి ప్రాజెక్టులపై మొత్తంగా రూ.1.69 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు కేటాయించే నిధుల్లో భారీగా కోత విధించింది. గత సంవత్సరం బడ్జెట్లో రూ.26,885 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్లో రూ.22,301 కోట్లు మాత్రమే కేటాయించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సైతం రూ.28,024 కోట్లు ప్రతిపాదించగా, ఇప్పుడు రూ.5,723 కోట్లు కోత వేయడం గమనార్హం. సాగునీటి రంగానికి సంబంధించిన కేటాయింపులు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కేంద్రం ఏఐబీపీ తదితర పథకాల కింద అందిస్తున్న నిధులకు రాష్ట్ర వాటాగా రూ.100 కోట్లు కేటాయించింది. భారీ ప్రాజెక్టులపై కాకుండా, మీడియం ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టిసారించినట్టు బడ్జెట్ కేటాయింపులను బట్టి అర్థమవుతున్నది.
సాగునీటి రంగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, ఆర్డీఎస్ లింక్ కెనాల్, సంగంబండ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించింది. నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, మూసీ, ఎన్ఎస్పీ లిఫ్ట్ స్కీమ్‌లకు, ఖమ్మం జిల్లాలో సీతారామ, వైరా, ఎస్సారెస్పీ స్టేజ్- 2 ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించింది. ఇతర అనేక ప్రాధాన్యాలు కలిగిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపింది. దేవాదుల, వరదకాలువ, చిన్నకాళేశ్వరం, కుప్తితోపాటు పలు ప్రాజెక్టులకు మాత్రమే కొద్దిమేర నిధులు విదిల్చింది. కాళేశ్వరం, చనాకా-కొరాట, నీల్వాయి, మత్తడి, ర్యాలివాగు, జగన్నాథ్‌పూర్, కాళేశ్వరం, నిజాంసాగర్ ఆధునికీకకరణకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది.
తెలంగాణ సాగునీటి రంగంలో చెరువులు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. మిషన్‌కాకతీయ పథకాన్ని చేపట్టి ఏటా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించే నిధులను సగానికంటే ఎక్కువగా తగ్గించింది. గత బడ్జెట్లో రూ.1,011.14 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.585.63 కోట్లు కేటాయించారు. అందులో మిషన్ కాకతీయకు రూ.273 కోట్లు మాత్రమే కేటాయించింది. మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కోసం గత ప్రభుత్వం జీవో 45 ద్వారా ప్రతి బడ్జెట్లో రూ.250 కోట్లకుపైగా కేటాయిస్తూ రాగా, ప్రస్తుత బడ్జెట్లో భారీగా కోత విధించారు. కేవలం రూ.50 కోట్లు కేటాయించింది. చిన్నలిఫ్ట్ స్కీమ్‌ల నిర్వహణకు సంబంధించిన బడ్జెట్లో కూడా కోత విధించింది.
