EPC | హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ): నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై శనివారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈపీసీ ప్రాజెక్టుల రద్దు వల్ల వచ్చే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలనే అంశంపై సమాలోచనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005 నుంచి 2014 వరకు జలయజ్ఞంలో భాగంగా అనేక సాగునీటి ప్రాజెక్టుల పనులను ఈపీసీ విధానం కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని రద్దు చేసి, లంప్సమ్ విధానాన్ని పునరుద్ధరించింది. స్వరాష్ట్రంలో చేపట్టిన కొత్త పనులన్నీ లంప్సమ్ విధానంలోనే అప్పగించారు. అప్పటికే ఈపీసీకి విధానంలో అప్పగించిన పనులను కొనసాగించారు. ఈపీసీ విధానంలోని లోపాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పనులన్నీ రద్దు చేయాలని సాగునీటిశాఖ భావిస్తున్నది.
కొనుకునే పెన్షన్ మాకొద్దు
ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నూతన పెన్షన్ విధానంపై కేంద్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఉద్యోగి తన కంట్రిబ్యూషన్‌తో పెన్షన్‌ను కొనుక్కునే విధానాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ సీమ్ (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తేల్చిచెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1970 సెం ట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పాత విధానంలోనే పెన్షన్ ఉండాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి తన సర్వీస్‌లో 50% మొత్తాన్ని జమచేస్తే ప్రభుత్వం 20% తీసుకొని మిగతా 30 శాతం ఉద్యోగులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. 20 శాతాన్ని నష్టపోతామని తెలిసి ఏ ఉద్యోగైనా పెట్టుబడి పెడతారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధానంపై కేంద్రం పునరాలోచించాలని కోరారు.
వయనాడ్ విలయంతో ద్రవించిన హృదయం
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వయనాడ్ విలయంతో తన హృదయం ద్రవించిందని మంత్రి సీతక్క అన్నారు. వయనాడ్‌లో విలయానికి అతలాకుతలమైన ప్రాంతాలను శనివారం ఆమె పరిశీలించారు. ముండకై శ్మశానవాటికలో మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాల సహాయార్థం సేకరించిన రూ.20 లక్షల చెక్కును అక్కడి ఎమ్మెల్యే టీ సిద్ధిఖీకి అందజేశారు. సుమారు రూ.10 లక్షల విలువైన దుస్తులు, నిత్యావసరాలను అందచేశారు. అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా తనకు అనుబంధం ఉన్న వయనాడ్ ప్రజలకు నైతిక మద్దతు పలికేందుకు వచ్చినట్టు తెలిపారు. విపత్తు బాధితుల జీవితాలను పునర్నిర్మించేందుకు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.