హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): అడ్డదారుల్లో జూనియర్లకు ఇన్చార్జి బాధ్యతలు కట్టబెడుతూ ప్రమోషన్లు కల్పించడం ఏంటని ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు మండిపడ్డారు. సీనియార్టీ ప్రకారమే రెగ్యులర్, ఇన్చార్జి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సచివాలయంలో గురువారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. 2004లో ఇరిగేషన్‌శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ)గా నియామకమయ్యామని, 2010-12 ప్యానల్ ఇయర్లో డీఈఈలుగా పదోన్నతి పొందామని, గత 12-15 ఏండ్లుగా ఆయా కీలక విభాగాల్లో సేవలందిస్తున్నామని వివరించారు.
సుదీర్ఘకాలంగా ఇరిగేషన్‌శాఖలో ప్రమోషన్లు చేపట్టడం లేదని, ఇప్పుడు సీనియర్లను కాదని 2005, 2007, 2008 బ్యాచ్‌లకు చెందిన ఇంజినీర్లకు అడ్డదారుల్లో ఇన్చార్జి బాధ్యత లు అప్పగిస్తూ ప్రమోషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అనేకమంది ఆయా బ్యాచ్‌లకు చెందిన జూనియర్లు ఈఈలుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఇది శాఖలో జూనియర్లు, సీనియర్ల మధ్య విభేదాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం శాఖలో అనేక ఖాళీలు ఏర్పడ్డాయని, ఇకనైనా సత్వరమే ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని కోరారు.