వికారాబాద్, డిసెంబర్ 9, (నమస్తే తెలంగాణ): పల్లె, బస్తీ దవాఖానాల్లో పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్) పోస్టుల భర్తీలో అవకతవకలపై వికారాబాద్ జిల్లాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరసారాలు జరిగినట్టు తెలుస్తున్నది. ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల ఎంపిక జాబితాతోపాటు తుది జాబితాను ఆన్లైన్లో పొందుపర్చిన సంబంధిత అధికారులు పోస్టుల ఖాళీల వివరాలను గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 25 పోస్టుల భర్తీకిగాను 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక జాబితాను ఆన్లైన్లో పొందుపర్చడంతోపాటు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయా ఖాళీల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కలెక్టర్ ఆదేశించినట్టు డీఎంహెచ్‌వో కార్యాలయం తెలుపడంతో అభ్యర్థులు వెళ్లిపోయారు. అవకతవకలు తెలిసి వాయిదాకు ఆదేశించారా?.. ఇతర కారణాలతోనా అనే దానిపై చర్చ జరుగుతున్నది.