శేరిలింగంపల్లి, డిసెంబర్ 28: గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురిపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖలో లోలోన ది లైవ్ స్టార్ కంపెనీ పేరిట సయ్యద్ మొయిజ్ కాంట్రాక్టర్‌గా చెలామాణి అవుతున్నాడు. శేరిలింగంపల్లి, కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పశుసంవర్ధకశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవసాయితో కలిసి గొర్రెల పంపిణీ సేకరణలో భాగంగా ఆగస్టు 13 నుంచి 23 వరకు ఏపీలోని పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు.
అక్కడి 18 రైతుల నుంచి 133 యూనిట్ల గొర్రెలను వీరు కొనుగోలు చేశారు. ఈ కాంట్రాక్టును లోలోన కంపెనీకి దక్కించుకొన్నది. పశుసంవర్ధకశాఖలో అర్హులైన రైతుల ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు అకౌంట్ల నంబర్లు సేకరించి వారిస్థానంలో ఫేక్ అకౌంట్లు సృష్టించి మొయిజ్ డబ్బులు పంపిణీ చేసినట్టు చూపిస్తూ నిధులు దారి మళ్లించాడు. దాదాపు రూ2.10 కోట్ల అవకతవకలకు పాల్పడ్డాడు. గొర్రెల విక్రయానికి సంబంధించి రైతులు డబ్బుల కోసం నిరీక్షించి పశసంవర్ధక కార్యాలయానికి సంప్రదించారు. తమకు చెల్లించాల్సిన నగదును బినామీ ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు గుర్తించిన బాధిత రైతులు గచ్చిబౌలి పోలీసులను అశ్రయించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మెయిజ్తోపాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిపై కేసు నమోదు చేశారు.