హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదేశించారు. అసిస్టెంట్ ఎస్పీలు క్రమశిక్షణతో మెలిగి.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని సూచించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లలో నిత్యం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిందితులను పట్టుకున్నప్పుడు ప్రధాన సూత్రధారులను గుర్తించడం ద్వారా డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ పోలీస్స్టేషన్ల తనిఖీలకు వెళ్లినప్పుడు సిబ్బందికి సూచనలు చేయాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలని పేర్కొన్నారు.