హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఈ నెలాఖరు నాటికి సారా రక్కసిని పారదోలాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సారా తయారీ కేంద్రాలపై ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నది. బెల్లం అక్రమ రవాణాను నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నది. సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపి విస్తృతంగా కేసులు నమోదు చేస్తున్నామని, మంగళవారం ఒక్కరోజే భారీస్థాయిలో సారా, బెల్లం, గంజాయి పట్టుబడిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మొత్తంగా 16,951 లీటర్ల సారాను, 61,739 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 3,380 కేసులు నమోదు చేసి, 1,159 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మొత్తం 906 మందిని బైండోవర్ చేశామని, 211 వాహనాలను సీజ్ చేశామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీగా బెల్లం, సారా, గంజాయి పట్టుబడినట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అత్తాపూర్ కేశవనగర్‌లోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 7,740 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.10 లక్షలపైనే ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు సమ్మకల గద్దెల ప్రాంతంలో నాటుసారా తయారీ కోసం కొత్తగూడెం నుంచి తీసుకొస్తున్న 320 కిలోల బెల్లం, 50 కేజీల పటికతోపాటు 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. కొత్తగూడెం శివారులోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 29 లీటర్ల నాటుసారా పట్టుకొన్నామని, ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగరం, కాటారం ప్రాంతాల్లో 55 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, 11మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలంలో రాజాస్థాన్కు చెందిన వ్యక్తి నుంచి 119 స్ట్రా పప్పి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని వేర్వేరు తండాల్లో 5 లీటర్లు, మహబూబబాద్ జిల్లాలో రెండు చోట్ల 16 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుంచి హైదరాబాద్‌కు 57 కిలోల గంజాయిని తీసుకొస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.