హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్న ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఆర్టీసీకి ఎండీగా నాలుగేండ్లపాటు సేవలందించిన సజ్జనర్.. హైదరాబాద్ సీపీగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం తాజాగా నియమించింది. కొన్నేండ్లుగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని నాగిరెడ్డి ఏ మాత్రం బయట పడేయగలరోనని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదురుచూస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ‘అపాయింటెడ్ డే’ ఒకటి. రాష్ర్టాభివృద్ధిలో కీలకంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం 2023 ఆగస్టులో అసెంబ్లీలో బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 అక్టోబర్లో ఎన్నికల కోడ్ రావడంతో.. నాటి నుంచి నేటివరకూ వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి.
ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. దీంతో ఇదే సమస్యను ప్రధానం చేసుకొని గత మే నెల 7న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సైతం పిలుపునిచ్చారు. కానీ, ప్రభుత్వం కార్మిక సంఘాలను విభజించి చర్చించడంతో ఆ సమ్మెను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల నాటి నుంచీ టీజీఎస్ ఆర్టీసీలో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. 3,038 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పి.. ఇప్పటికి 21 నెలలుగా తాత్సారం చేస్తూనే ఉన్నారు. వేతనాల కోసం ప్రతినెలా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని వేడుకునే దీనస్థితికి చేరింది. వేతనాలతోపాటు రుణాల వడ్డీలు, పీఎఫ్లకు నానా తంటాలు పడుతున్నారు.
అప్పులపై వడ్డీలు, ఇతర బకాయిలకు వందల కోట్లను ఆర్టీసీ చెల్లిస్తున్నది. ఇక ఆర్టీసీకి ప్రతినెలా ఇవ్వాల్సిన మహాలక్ష్మి బాకీ సైతం వందల కోట్లలోనే ఉంటుందని కార్మికులు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని ట్రేడ్ యూనియన్లపై నిషేధం ఎత్తివేస్తామని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలుపుకోలేదు. కొత్త నియామకాలు లేక, రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందిపై పనిభారం దారుణంగా పెరిగిందని కార్మికులు వాపోతున్నారు. రోజుకు 16 గంటల డ్యూటీ చేస్తున్నామని, విశ్రాంతి లేక ప్రమాదాల గురవుతున్నామంటున్నారు. ఆర్టీసీలో దారుణమైన శ్రమ దోపిడీకి గురవుతున్నామని చెబుతున్నారు.