హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఈనెల 8,9 తేదీల్లో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025’కు రాష్ట్ర ప్రభు త్వం వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులకు శుక్రవారం ఆహ్వానాలు అందజేసింది. మంత్రులు స్వయంగా వెళ్లి వారిని ఈ సమ్మిట్‌కు రావాలని కోరారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కూడా ఆహ్వానించారు.
రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం కోసమే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను నిర్వహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌లో ప్రదర్శించాల్సిన ఆడియో -విజువల్ (ఏవీ)ల కంటెంట్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయరంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలని మంత్రి తుమ్మల అధికారులకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి, మార్ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.