నారాయణపేట : గ్లోబల్ సదస్సు( Global Summit) పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అన్నారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో విజయ్ దివస్ ( Vijay Diwas ) సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టబడులు రావడం ఎంతో అభినందనీయ మైనప్పటికీ అవి కేవలం ప్రకటనలకు, ఒప్పందాలకే పరిమితమా కాకూడదని వెల్లడించారు. ఆచరణలో కూడా సాధ్యం చేసి చూపించాలని సూచించారు.
గ్లోబల్ సమ్మీట్ను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మశక్యంగా కనిపించడం లేదన్నారు. అందుకు గతంలో లక్షల రూపాయల విదేశీ పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి, ఆయన మంత్రి వర్గ సహచరులు చేసిన నానా హంగామానే ఉదాహరణే చెప్పవచ్చునని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులపై ముందుగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో కోట్ల ధనంతో గ్లోబల్ ప్రచార ఆర్భాటం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ సదస్సు ద్వారా గ్లోబల్ నేతగా ఎదిగేందుకు వేదికను ఆసరాగా చేసుకుని ఆయన ఫ్యూచర్ క్యూర్ చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) నిబంధనల ప్రకారంగా 50 కోట్లతో ఫార్ములా రేస్ నిర్వహించడంతో రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు తీసుక వస్తే కేసులు నమోదు చేసిన రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రానికి ఒక్క రూపాయి ఉపయోగం లేని ఫుట్బాల్ ఆట కోసం వందకోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మును తన స్వలాభం కోసం ఉపయోగిస్తున్న రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.