జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అటవీభూమి అన్యాక్రాంతంపై అధికారులు సర్వే ప్రారంభించారు. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 1న ప్రచురితమైన ‘3 వేల ఎకరాల అటవీభూమి హాంఫట్ ’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో రెండేండ్లుగా అడవులు అన్యాక్రాంతం కావడం, పోడు పెరిగిపోవడం, రూ.లక్షకు ఎకరం విక్రయించడంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించింది. కాంగ్రెస్ పార్టీ ముసుగులో పోడు దందాకు పాల్పడుతున్న డాన్‌ను వెలుగులోకి తెచ్చింది. కథనంపై స్పందించిన అటవీశాఖ అధికారులు అడవుల అన్యాక్రాంతం, పోడు దందాపై దృష్టి సారించారు. జిల్లాలో రెండేండ్లలో 300 హెక్టార్ల వరకు పోడు జరిగినట్టు గుర్తించారు.
మరో 220 హెక్టార్లు అన్యాక్రాంతమైనట్టు తేల్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆజంనగర్, మహాముత్తారం, పలిమెల అటవీప్రాంతాల్లో ఎక్కువగా పోడు జరిగినట్టు గుర్తించి చర్యలకు సిద్ధమయ్యారు. సరిహద్దుల్లో పోడు డాన్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జిల్లా అటవీ అధికారి నవీన్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ’ కథనం ఆధారంగా అటవీ అన్యాక్రాంతం, పోడుపై తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ కలెక్టర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (కాళేశ్వరం సర్కిల్)కు లేఖ రాశారు. జిల్లాలో అడవుల అన్యాక్రాంతంతోపాటు పోడు జరుగుతున్నదని, దీనిపై చర్యలు తీసుకుంటున్నామని లేఖల్లో పేర్కొన్నారు.
300 హెక్టార్ల వరకు అటవీభూమి అన్యాక్రాంతాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, పోడు దందాపై సర్వే జరుపుతున్నామని, అటవీ భూమిని ఆక్రమించుకుని పోడు చేస్తున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. సరిహద్దుల్లో పోడు డాన్‌పై అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పలిమెల ఎస్ఐ రమేశ్ మాట్లాడుతూ.. లెంకలగడ్డకు చెందిన చెన్నూరి వెంకటస్వామి, అతడి సోదరులపై అటవీభూమి ఆక్రమణపై కేసు నమోదు చేశామని తెలిపారు.