హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పడం వాస్తవం కాదా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కార్యాలయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై మరోసారి విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేసుపై విచారణ జరిగింది. వీరిద్దరిపై డాక్టర్ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా వీరిద్దరిని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశా రు. నియోజకవర్గాల్లోని అభివృద్ది పనుల గురించి చర్చించడానికే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారని, ఎక్కడా పార్టీ మారినట్టు ప్రకటించలేదని న్యాయవాదులు పేర్కొన్నారు.
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించాలనుకున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌ను కలిశారని గుర్తుచేశారు. అభివృద్ధి నిధుల కోసం వెళ్లాల్సి వస్తే సచివాలయానికి వెళ్తారని, కానీ వారు రేవంత్ ఇంటికి వెళ్లారని చెప్పారు. అభివృద్ది పనులు, నిధుల గురించి అసలు మాట్లాడలేదని, కాంగ్రెస్‌లో చేరుతున్నామంటూ ఆ రోజు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రేవంత్కాం గ్రెస్ కండువాలు కప్పారని వివరించారు. సంబంధించిన మీడియా కథనాలను, ఫొటోలు, వీడియో సాక్ష్యాలను అందజేశారు. ఫిరాయించిన మాట వాస్తవమేనని, దీనిపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌లు విజ్ఙప్తి చేశారు.
తదుపరి విచారణ 14కు వాయిదా..
ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తదుపరి విచారణ ఈ నెల 14, 15వ తేదీల్లో చేపట్టనున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత స్పీకర్ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.
ఆ ఇద్దరి విచారణ ఎప్పుడు..?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల విచారణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 15వ తేదీతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 8 మందిపై స్పీకర్ విచారణ పూర్తవుతుంది. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ నేపథ్యంలో వీరిద్దరిని కూడా స్పీకర్ విచారణకు పిలుస్తారా.. లేదా అన్నది చూడాలి.