హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మారుల తుది జాబితాను, జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దుచేసి పునర్మూల్యాంకనం జరపాలని, లేదంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు అర్హత సాధించిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అర్హత సాధించిన అభ్యర్థుల తరఫున డీ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పారదర్శకంగానే గ్రూప్-1 పరీక్ష జరిగిందని చెప్పారు.
అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో మూల్యాంకనాన్ని చీఫ్ ఎగ్జామినర్ పర్యవేక్షించారని, ఒకరికి ముగ్గురు మూల్యాంకనం చేశారని తెలిపారు. ఈ పరీక్షలో కాపీయింగ్ జరిగినట్టు ఎలాంటి ఆరోపణలు లేవని, అర్హత సాధించలేనివారే కోర్టును ఆశ్రయించారని వివరించారు. రెండు హాల్‌టికెట్ల విధానంపై పరీక్షకు ముందే అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదని పేర్కొన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీలోని 18, 19 సెంటర్లలో పురుషులకు సరైన సౌకర్యాలు లేనందున వాటిని మహిళలకే కేటాయించినట్టు చెప్పారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహించినప్పుడు గ్రూప్-1 పరీక్ష ఎందుకు నిర్వహించరాదన్న సందేహాల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోరాదని తెలిపారు. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
గీతం వర్సిటీకి హైకోర్టు షాక్ ; విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు నిరాకరణ
హైదరాబాద్,డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని గీతం వర్సిటీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ వర్సిటీకి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేలా ఉత్తర్వులు జారీచేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. 118కోట్ల విద్యుత్తు బకాయిల్లో 50% చెల్లిస్తేనే సరఫరాకు ఆదేశాలిస్తామని జస్టిస్ నగేశ్ భీమపాక సోమవారం స్పష్టంచేశారు. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.