గంగాధర, ఫిబ్రవరి 21 : శస్త్ర చికిత్స చేసుకుని సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ లబ్ధిదారుకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్న చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపేరున ఇది వరకే వేరొకరు నగదు తీసుకున్నారని సిబ్బంది చెప్పడంతో ఖంగుతిన్నది. హైదరాబాద్కు తిప్పి పంపితే మరో చెక్కు రాగా, మళ్లీ అదే పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకంపల్లికి చెందిన పిట్టల లలిత రెండేళ్ల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో శస్త్ర చికిత్స చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంది. గతేడాది జూలై నెలలో 12 వేల పరిహారం మంజూరైంది. గంగాధరలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా 16 జూలై 2004న చెక్కును తీసుకున్న లలిత గర్శకుర్తి గ్రామీణ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లింది. ఇదివరకే చెక్కు వేరొకరు ఆ డబ్బులు తీసుకున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. స్థానిక నాయకులతో చెప్పగా చెక్కును హైదరాబాద్కు పంపించారు. తిరిగి అదే చెక్కును 776140 నంబర్ చెక్కు ను 30 జనవరి 2025గా మార్చి పంపించారు. మరోసారి చెక్కును డిపాజిట్ చేయడానికి అదే బ్యాంకుకు లలిత భర్త వెంకటేశం వెళ్లగా చెక్కు నంబర్ మారితేనే డబ్బులు వస్తాయని సిబ్బంది తెలపడంతో నిరాశగా వెనుదిరిగాడు. అధికారులు స్పందించి సీఎంఆర్ఎఫ్ పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.