Rain | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాయుగుండం ప్రభావంతో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 30 సెం.మీపైగా వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.65 సెం.మీ, చిన్నగూడూరులో 45.16 సెం.మీ, నర్సింహులపేటలో 40.58, నెల్లికుదురులో 38.35 సెం.మీ, దంతాలపల్లిలో 35.09 సెం.మీ, మరిపెడలో 34.42 సెం.మీ, సూర్యాపేట జిల్లా మద్దిరాలలో 34.13 సెం.మీ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 33.02 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 16.28 సెం.మీగా వాతావరణ శాఖ గుర్తించింది. 2006 సెప్టెంబర్ 19న కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 44.06 సెం.మీ వర్షపాతం నమోదైంది. 18 సంవత్సరాల తర్వాత 2024 సెప్టెంబర్ 1న మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.65 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీవర్షాలతో వరద ఉప్పొంగుతున్నది.
ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులు అలుగు పారి గండ్లు పడుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పల్లెలు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి చేరిన నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గాలివాన బీభత్సానికి సుమారు 200 ఎకరాల్లో అడవి ధ్వంసమైంది. భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలోని తెలంగాణ నయాగార బొగత ఉధృతంగా జాలువారుతున్నది. దీంతో అటవీశాఖ అధికారులు సందర్శనను నిలిపివేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరానది వనదుర్గా ప్రాజెక్టు మత్తడి దుంకడంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు దేవస్థానంపైకి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధించారు.
సాగర్, మూసీ కాల్వలకు గండ్లు
వరద పోటెత్తండంతో కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. దాంతో రామచంద్రాపురం గ్రామంలోకి నీళ్లు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. పంటలు నీటమునిగాయి. ఇక సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో మూసీ ఎడమ కాల్వకు గండి పడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. మూసీ అధికారులు వెంటనే ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఎన్ఎస్పీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే ప్రక్రియను ప్రారంభించారు.
రెండు రాష్ర్టాల మధ్య రాకపోకలు బంద్
తెలంగాణ- ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచాయి. సాధారణంగా వాయుగుండం తీరం దాటిన ప్రాంతాల్లో ఉత్తర, దక్షిణ తీరాలలో తీవ్రత ఎక్కువగా ఉండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రావణి వెల్లడించారు. వాయుగుండం తీరం దాటిన తర్వాత బలహీన పడుతుందని, అనంతరం వర్షాలు తగ్గుముఖం పడతాయని ఆమె తెలిపారు.
భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో ఊర్లు, కాలనీలు నీటమునిగాయి. రోడ్లు కోతకు గురవగా, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. రాష్ట్రమంతా వర్ష బీభత్సం నెలకొనగా.. ఖమ్మం జిల్లా మాత్రం జలవిలయంతో విలవిలలాడింది. ఇండ్లపైకి ఎక్కి ప్రజలు సహాయం కోసం అర్థించడం కనిపించింది. 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సహాయ చర్యల తీవ్రత అంతగా కనిపించలేదు. సర్కారు వైఫల్యంపై పలుచోట్ల ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాల్లో నమోదైన అత్యధిక వర్షపాతం వివరాలు సెంటీమీటర్లలో