హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సోమన్నకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం పాట పాడానని, తెలంగాణ భవన్‌కు రావడం, బీఆర్ఎస్లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టు ఉన్నదని అన్నారు. గత దశాబ్దకాలంలో చూసిన పార్టీలు ఏవీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కావని స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సినవన్నీ సీఎం కేసీఆర్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఉండుడు ఎందుకని ఇక్కడికి వచ్చానని చెప్పారు. పాలమూరు వలసలకు, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యకు, కాళేశ్వరం ద్వారా సాగునీటికి కేసీఆర్ పరిష్కారం చూపారని తెలిపారు. కళాకారులను ఎవరూ గుర్తించలేదని, కానీ సీఎం కేసీఆర్ వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని కొనియాడారు. కళాకారులను చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత ఆయదేనని అన్నారు. తన పాట తెలంగాణ సమగ్ర ప్రగతికి తోడైతదని, తెలంగాణ నిర్మాణంలో భాగస్వామి అయితదని తేల్చిచెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి 25 ఏండ్లు పట్టిందని, ఎన్నో నిర్భందాలు, కష్టాలు చూసి ఈ స్థాయికి వచ్చానన్న సంగతి తనను విమర్శించేవాళ్లు గుర్తించుకోవాలని చురక అంటించారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో కళాకారులు, ఉద్యమకారులను గౌరవించుకున్న తీరు ఆదర్శమని తెలిపారు. గతంలో కళాకారులు, కవులు అనేక రకాలుగా అణిచివేతకు గురయ్యారని, మీకు పరిపాలన వచ్చా? పాటలు వచ్చా? అంటూ రకరకాలుగా అవమానించారని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్లో చేరడం ద్వారా ఏపూరి సోమన్న గౌరవం పెరుగుతుందని వెల్లడించారు. ఎక్కడ తన అవసరం ఉన్నదని భావిస్తాడో అక్కడ సోమన్న ఉంటారని అన్నారు. సమాజహితాన్ని కాంక్షించి సోమన్న మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అందరం ఏకం అవుదామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు మంచి తెలంగాణను అందిద్దామని, ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములం అవుదామని అన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ చరిత్రలో కళాకారుడికి జాయినింగ్ సభ జరగలేదని, గాయకుడిగా సోమన్న చేరిక నూతన సంప్రదాయానికి నాంది పలికిందని వెల్లడించారు. ఈ అరుదైన ఘనత సోమన్నకు దక్కిందని అన్నారు. ‘సోమన్న రామన్నను కలిసిండు.. సంచలనం అయింది. రాజ న్న రాజ్యం కాదు రైతన్న రాజ్యం కావాలని సోమన్న వచ్చాడు. సోమన్నపై కొందరు ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు. కళాకారుడు సాయిచంద్ మరణించిన సందర్భంలో బీఆర్ఎస్ స్పందించిన తీరును తనను ఆలోచింపచేసిందని సోమన్న నాతో చెప్పారు’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీబీజీకేఎస్ నేత కెంగర్ల మల్లయ్య, కళాకారుడు మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.