వికారాబాద్, ఫిబ్రవరి 24, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు నూలి శుభప్రద్‌పటేల్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి, అధికారంలోకి వచ్చాక వారి గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో గత పదేండ్లలో బీసీల జనాభా లక్షల్లో తగ్గినట్టు చూపించారని విమర్శించారు. రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో బీసీల జనాభాను తగ్గించి చూపిస్తూ వారిని అణగదొక్కేవిధంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తారని శుభప్రద్‌పటేల్ నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..
46 శాతానికి తగ్గింపుపై అనుమానాలు
అసెంబ్లీలో బిల్లు తెస్తారు, చట్టం చేస్తారెమో అనుకున్నాం, కానీ కేవలం ప్రకటన మాత్రమే చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను పెంచే ఉద్దేశం లేదు. బీసీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ 14 నెలల కాలంలో అన్ని వర్గాలను మోసం చేసినట్టే బీసీలను కూడా తీవ్రం గా మోసం చేసింది. మొదట్నుంచి కూడా బీసీల జనాభా తెలంగాణలో 54 శాతానికిపైగా ఉంటుందని సంఘాలన్నీ చెప్పాయి, గతంలో 51 శాతం ఉంటారన్నా కూడా ఒప్పుకోలేరు. ఇప్పుడు దాన్ని 46 శాతానికి తగ్గించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ కృష్ణ య్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, చిరంజీవుల సంఘాలన్నీ ఈ నివేదికను వ్యతిరేకిస్తున్నాయి. స్వయంగా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే కులగణన రిపోర్ట్‌ను తగలబెట్టారు. సమైక్య రాష్ట్రంలోనే అన్యాయం జరిగిందని, బీసీల లెక్క తేలలేదని బాధపడుతుంటే.. ఈరోజు పెనం మీదినుంచి పొయ్యి లో పడ్డట్టు బీసీల పరిస్థితి తయారయ్యింది.
బీసీ జనాభాను 22 లక్షలు తగ్గించారు
తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర కుటుం బ సర్వేలో తెలంగాణ జనాభా 3.68 కోట్లు ఉన్నట్టు తేలింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 3.54 కోట్లు మాత్రమే అని చెప్తున్నది. 16 లక్ష ల జనాభా వివరాలు అందుబాటులో లేవు. 2014లో 3.68 కోట్లు ఉన్న జనాభా పదేండ్లలో కేవలం రెండు లక్షలు మాత్రమే పెరుగుతుందా ? 2014లో బీసీలు 1,85,61,856 (51 శాతం) ఉన్నా రు, ఇప్పుడు వారి సంఖ్య 1,64,91,790 (46.25 శాతం) అని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నది. అంటే బీసీల జనాభా 21,52,677 తగ్గినట్టు చూపిస్తున్నారు. వాస్తవానికి జనాభా వృద్ధి రేటు 1.35 శాతంగా ఉంది. ఆ రేటు ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లు దాటాలి. ఆధార్ కార్డుల లెక్కలు తీసుకున్నా, రేషన్ కార్డులను తీసుకున్నా జనాభా 4 కోట్లు దాటా లి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 3.70 కోట్లు అని చెప్తున్నది. బీసీలనే కాకుండా ఎస్సీలను 1.75 లక్షలు, ముస్లింలను 1.65 లక్షలు తగ్గించారు. మరోవైపు ఓసీల జనాభాను మాత్రం గతంతో పోలిస్తే 15,89,955 మందిని పెంచారు. 2014లో ఓసీల జనాభా 11 శాతం ఉండగా.. ఇప్పుడు 15.79 శాతం ఉన్నారని చెప్తున్నారు.
ప్రభుత్వ కట్టుకథలు
సామాజిక న్యాయమంటూ రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతూ కులగణనపై అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధారామయ్యను తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను నిరుడు ఫిబ్రవరిలో క్యాబినెట్ ఆమోదించింది. బీసీల కులగణన చేయాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి బీఆర్ఎస్తోపాటు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించా యి. ఫిబ్రవరి 16న కులగణన బిల్లును అసెం బ్లీ ఆమోదిస్తే.. మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఒక్కరోజు ముందు జీవో జారీచేసింది. కులగణనకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని బీసీ కమిషన్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ప్రభుత్వానికి నివేదిక అందజేశాము. ఆ నివేదికను మూడు నెలల వరకు పక్కన బెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు నిలదీశాయి. మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశించగా, రేవంత్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కట్టుకథలు చెప్తున్నది. వారిచ్చిన జీవోల్లోనే స్పష్టంగా రిజర్వేషన్లు 50% దాటవద్దని పొందుపర్చింది. బయటికి మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది.
రివ్యూ పిటిషన్ వేస్తేనే పెంపు సాధ్యం
ప్రతిఒక్కరి వివరాలను సమగ్రంగా సేకరించి, కులాలవారీగా లెక్కలు తీసి ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. బీసీల జనాభా 50 శాతం దాటిందని, రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టును కోరాలి. అప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
జనాభా లెక్కలు తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీల కులగణన కూడా చేయాలని దేశవ్యాప్తంగా బీసీలు కోరుకుంటున్నారు. కానీ ఎన్ని ఆవులున్నాయి, ఎన్ని పందులున్నాయి, మేకలు, గొర్లు, కోల్లు అంటూ జంతుగణన చేస్తున్న కేంద్రం బీసీ గణనపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బీసీల స్థితిగతులు మారాలంటే వారి జనాభా ఎంతో తేలాలి. అయితే 1931లో నిజాం రాజ్యంలో కులగణన జరిగింది. లెక్కలు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, రాష్ర్టాలు ఏం చేసినా సర్వేల వర కు మాత్రమే చేస్తాయి, సంక్షేమ పథకాల అమలు కోసమే వాడుకుంటాయి. కాంగ్రెస్ కు అన్ని తెలిసి బీసీలను మోసం చేసింది.