హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పెద్ద మొత్తంలో హషీష్ ఆయిల్ (గంజాయి నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్‌నగర్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.14 కోట్ల విలువైన 13.5 కిలోల హషీష్ ఆయిల్తోపాటు రూ.2 వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు, కిలో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయినవారిలో విశాఖ జిల్లా లువ్వసింగి గ్రామానికి చెందిన వంచురాబ్బ కొండబాబు, వంచురాబ్బ బాలకృష్ణ ఉన్నారని, వీరిద్దరూ అన్నదమ్ములని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎస్వోటీ డీసీపీ మురళీధర్ సోమవారం వెల్లడించారు. నిందితులు ఈ నెల 11న హైదరాబాద్‌కు వచ్చారని, ఓఆర్ఆర్ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఓ హోటల్ వద్ద రిసీవర్ల కోసం ఎదురుచూస్తూ పోలీసులకు పట్టుబడ్డారని వివరించారు.