Yoga Day | శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు, అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ యోగా శిక్షకులు గంధవళ్ల బాలసుబ్రహ్మణ్యం అందరి చేత యోగాసనాలు చేయించారు. ప్రతి యోగాసనానికి ఆయన వివరణ ఇస్తూ, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు. ఒంగోలు నగరానికి చెందిన చిన్నారులు రాధా రమణి, వల్లెపు ధనశ్రీ కలిసి గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థ, శివస్తోత్రాలకు నృత్యం చేశారు.
ఈ సందర్భంగా శ్రీశైల ప్రభ సంపాదకుడు డాక్టర్ సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. విజ్ఞానానికి నిలయమైన మన దేశంలో ఎన్నో వేల ఏండ్ల నుంచి అభివృద్ధి చెందిన పలు శాస్త్రాల్లో యోగశాస్త్రం కూడా ఒకటని తెలిపారు. వాస్తవానికి యోగా అనేది మన సంస్కృతిలో అనాదిగా ఆచరణలో ఉన్నప్పటికీ పతంజలి మహర్షి దాన్ని సూత్రబద్ధం చేసి యోగ సాధన మార్గాన్ని సుగమం చేశాడని గుర్తు చేశారు. యోగా సాధన అనేది ఆత్మ – పరమాత్మల అనుసంధానానికి దోహదం చేస్తుందన్నారు. యోగా అనేది మనసుతో పాటు ఇటు శరీరానికి కూడా సంబంధించింది అని తెలిపారు. యోగా మనసును కట్టడి చేస్తుందని, శాంతిని, విశ్రాంతిని ఇస్తుందన్నారు. అందుకే యోగా చేయడం వల్ల బుద్ధి వికసిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉప కార్య నిర్వహణాధికారి రవణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎం హరిదాసు, పీఆర్వో శ్రీనివాస్ రావుతో పాటు కేవీ శేషరావు, ఎస్ సుబ్బారావు, డి వెంకయ్య, ఎం స్వర్ణలత, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.