రామారెడ్డి, నవంబర్ 24: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సొంత పార్టీ నేతల మధ్య వైరం నడుస్తున్నది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు వ్యవహారశైలితో విసిగిపోయిన నాయకులు పార్టీ అధిష్ఠానాన్ని ఆశ్రయించారు. నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేందర్‌రెడ్డి, నారెడ్డి మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం రాత్రి గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు.
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపులేదని, వలస వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వతీరును నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే కనీసం ఖండించడం లేదని అన్నారు. స్థానికంగా ఉండటం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇందిరాగాంధీ జయంతి కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయకుండా అవమానపరుస్తూ నియంతలా వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే తన వ్యక్తిగత సిబ్బందితో నాయకులను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విదేశాలకు వెళ్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులతో కాకుండా వ్యక్తిగత సిబ్బందితో పంపిణీ చేయిస్తూ తమను అవమాన పరుస్తున్నారని తెలిపారు. 20 ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించడంలేదని, ఎదురు మాట్లాడితే ఎమ్మెల్యే వర్గీయులు గూండాగిరి చేస్తూ దూషిస్తూ, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలో కనీసం ప్రొటోకాల్ పాటించకుండా ఒంటెద్దు పోకడలతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.