బండి సంజయ్‌పై అసమ్మతి సెగలు
పార్టీ అధ్యక్షుడి ఒంటెత్తు పోకడపై ఫైర్
రాష్ట్రవ్యాప్తంగా రహస్య మంతనాలు
సొంత జిల్లాలోనే బండిపై అసంతృప్తి
ఢిల్లీ పెద్దలు చెప్పినా వినని అసంతృప్తులు
రాష్ట్ర స్థాయిలో నాలుగు గ్రూపులుగా పార్టీ
హైదరాబాద్, ఫిబ్రవరి 22 : బీజేపీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసమ్మతి సెగ రగులుతున్నది. సంజ య్ ఒంటెత్తు పోకడలపై సీనియర్, జూనియర్ అన్న తేడాలేకుండా నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం బండి సొంత జిల్లా కరీంనగర్లోనూ పలువురు నేతలు రహస్యంగా సమావేశమై, బండికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు సమాచారం. బండి తీరుపై పార్టీలోని సీనియర్ నేతలు ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఎవరినీ లెక్కచేయకుండా హీరోగా చెలామణి అయ్యేందుకు బండి పరితపిస్తున్నారని అంతర్గత సమావేశాల్లో విమర్శలు గుప్పిస్తున్నట్టు తెలిసింది. ఇన్నాళ్లు పార్టీ కోసం ఓపికపట్టిన నేతలంతా ఇప్పుడు అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
రహస్య భేటీలు
బండి సంజయ్ తీరుతో పార్టీలో ఇబ్బందులు పడుతున్న నేతలంతా ఒకే తాటిపైకి వస్తున్నారు. ఎక్కడికక్కడ రహస్య సమావేశాలు నిర్వహించి తమతమ వర్గాలను కూడగడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావుతోపాటు మరికొంత మంది నేతలు బండి తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతోపాటు మరో సీనియర్ నేత రాజేశ్వర్‌రావు, నల్లగొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తితోపాటు మరికొంత మంది నేతలు పార్టీ అధ్యక్షుడిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మహబూబ్‌నగర్‌లో నాగురావు నామోజీ, హైదరాబాద్‌లో వెంకటరమణి, వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌లో అల్జాపూర్ శ్రీనివాస్, మల్లారెడ్డి, ఆదిలాబాద్‌లో గోనె శ్యామ్ సుందర్రావు తదితర నేతలు అసంతృప్తులను ఒక్కదగ్గరకు చేరుస్తున్నట్టు సమాచారం. వీరంతా పార్టీలో ఇమడలేక బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత, మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన దారిలోనే చాలామంది నేతలు నడిచే అవకాశం ఉన్నదని సమాచారం. బండి సంజయ్ తీరు మారకుంటే పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని గమనించే నేతలెవరూ రహస్య సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం. అయినప్పటికీ అసంతృప్త నేతలు బేఖాతర్ చేస్తూ వరుసగా రహస్య సమావేశాలను
నిర్వహిస్తుండటం గమనార్హం.
ఎవరి కుంపటి వారిదే
రాష్ట్ర బీజేపీలో కూటముల రాజకీయం ఊపందుకొన్నది. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్ర స్థాయి కీలక నేతలంతా వర్గాలుగా విడిపోయి ఎవరికివారు సొంత గ్రూపులు తయారుచేసుకొంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎప్పటి నుంచో తన సొంత వర్గాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు మరింత బలం పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొనే పనిలో ఉన్నారు. ఎంపీ అర్వింద్ కూడా సొంత వర్గాన్ని తయారుచేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్గం ఉండనే ఉన్నది. ఇలా వర్గాలుగా విడిపోయి.. ఒక వర్గం మరో వర్గంపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీని దగ్గరి నుంచి గమనిస్తున్నవారు అంటున్నారు.