హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతున్నాయి. ‘పేరు అమ్మలది.. పెత్తన కాంగ్రెస్ లీడర్లది’ అన్నట్టుగా సాగుతున్నది వ్యవహారం. ఈ పనుల్లో కాంగ్రెస్ నేతల జోక్యం పెరగడంతో పలు పాఠశాలల్లో పనులు ముందుకు సాగడంలేదు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పనులు చేపట్టేందుకు మహిళా సంఘాలు సమాయత్తమయ్యాయి. కానీ స్థానిక కాంగ్రెస్ లీడర్లు తామే చేపడతామంటూ మెలికపెట్టడంతో ఇప్పటివరకు పనులు ముందుకు సాగడంలేదు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కమిటీ సభ్యులకు బదులు కాంగ్రెస్ నేతలు హాజరు కావడంతో అధికారులు బిత్తరపోయారు. పలు జిల్లాల్లోను ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తున్నది. ఎంపిక సమయంలోనే ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన స్కూళ్లను మినహాయించారు. ఆయా స్కూళ్లను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టేందుకు పరిగణనలోకి తీసుకోలేదు.
మైనర్ రిపేర్లు మాత్రమే
సర్కారు బడుల్లో వసతులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా బాధ్యతలను స్వయంసహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించింది. ఇందుకోసం అమ్మ ఆదర్శపాఠశాల కమిటీలను ఏర్పాటుచేసింది. మౌలిక వసతులు, టాయిలెట్లు, మరమ్మతులు, శానిటేషన్, యూనిఫారాలు కుట్టించడం వంటి 10 రకాల పనులను ఈ కమిటీలకు అప్పగించారు. ఒక్కో స్కూల్‌కు ఎమర్జెన్సీ ఫండ్‌గా పాఠశాల స్థాయిలో రూ. 25వేలు, ఎంపీడీవోలకు లక్ష వరకు మంజూరుచేసే అధికారమివ్వగా, లక్షకు మించిన పనులను మంజూరుచేసే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
ఈ నిధులతో బడుల్లో అవసరమైన కరెంట్ స్విచ్‌లు, వైర్లు, ట్యూబ్‌లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, నీటి సరఫరా ఏర్పాట్లు, నల్లాల బిగింపు, మూత్రశాలల రిపేర్లు, తలుపులు, కిటికీలు వంటి వాటికి మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. తొలుత మేజర్ రిపేర్లను సైతం చేపడతామని ప్రకటించి, బడ్జెట్ పెరుగుతున్నదని మేజర్ రిపేర్లను పక్కనపెట్టారు. ఈ మైనర్ రిపేర్ల పూర్తికి జూన్ 12 గడువు విధించా రు. పలు పాఠశాలల్లో ఇంకా పనులు ప్రారంభంకాలేదు. గడువులోపు పూర్తికావడం కష్టంగానే కనిపిస్తున్నది. పనులు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డీఈవో సహా ఇతర అధికారులకు నోటీసులిచ్చారు.
డీఎంఎఫ్టీ నిధులు మళ్లింపు..
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టాల్సిన పనుల కోసం విద్యాశాఖ దాదాపు రూ.1100 కోట్లకు పైగా అంచనాలు రూపొందించింది. కానీ ప్రభుత్వం ఇటీవల రూ. 600 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల వద్ద గల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులను ఈ పథకం కోసం మళ్లించారు. వాస్తవానికి డీఎంఎఫ్టీ నిధులను మైనింగ్, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో ఖర్చుచేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా రాష్ట్రమంతటా ఖర్చుచేసేందుకు మళ్లించడం గమనార్హం.