జహీరాబాద్, జనవరి 7: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన స్థానికంగా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలోకి వెళ్లకుండా పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంట గ్రామానికి చెందిన బ్యాగరి రాజు, వనజ దంపతుల కుమార్తె స్వప్న (17) రంజోల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి చదువుకునేందుకు పుస్తకాల కోసం డార్మెటరీ గదికి వెళ్లింది. ఆ తరువాత స్వప్న చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. ఉపాధ్యాయులు వెంటనే గదిలోకి వెళ్లి విద్యార్థినిని కిందకు దింపి జహీరాబాద్ సర్కారు దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు విద్యార్థిని అప్పటికే మరణించినట్టు తెలిపారు. ఆ వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే మాణిక్‌రావు పాఠశాల వద్దకు రాగా.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.