హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల కానున్నాయి. ఏప్రిల్ 5 లేదా 6 తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌బోర్డు భావిస్తున్నది. ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై.. మార్చి 17తో ముగుస్తాయి. ఫిబ్రవరి 26 నుంచే ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని చేపట్టాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. అంటే పరీక్షలు ప్రారంభమైన తెల్లారి నుంచే మూల్యాంకనం ప్రారంభంకానున్నది. ఈ సారి సీజీజీ సహకారంతో ఆన్లైన్ స్టాఫ్ పోర్టల్‌ను తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌లో 41వేల మంది స్టాఫ్ వివరాలు పొందుపరిచారు. ఈ డాటా అధారంగానే మూల్యాంకన వి ధులు కేటాయించనున్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 6 నుంచి నిర్వహించే అవకాశమున్నది. ఆ తర్వాత 20 రోజల్లో మూ ల్యాంకనం పూర్తవుతుంది. మే నెలాఖరులో అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల చేస్తారు. జూన్ 1 నుంచి ఇంటర్ 2026-27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. మొత్తంగా కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే పరీక్షలు, ఫలితాలు ప్రకటించి, కేవలం విద్యాసంబంధ అంశాలపైనే ఫోకస్ పెట్టాలన్న దిశలో అధికారులు ఉన్నారు.
రేపటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 2న ప్రారంభమై 21న ముగుస్తాయి. రెండు విడతల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య శనివారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రాక్టికల్స్ పరీక్షల వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలిసారిగా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఒక కాలేజీ విద్యార్థులకు మరో కాలేజీలో సెంటర్లు కేటాయించామని తెలిపారు. ప్రాక్టికల్స్‌కు 5.20 లక్షల మంది హాజరుకాబోతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,440 సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.