నీలగిరి, అక్టోబర్ 7: ప్రేమ పేరుతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిని నమ్మించి లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం కలకలం సృష్టించింది. కన్న కూతురు విగత జీవిగా మారడాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన నల్లగొండలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ మండలం గుట్టకింద అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ ట్రాక్టర్ డ్రైవర్. వృత్తిరీత్యా చుట్టుపక్కల గ్రామాల్లో పనులు చేస్తున్న క్రమంలో ఓ బాలికతో పరిచయమైంది.
ఆరు నెలల క్రితం ఆ బాలిక నల్లగొండలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. రోజూ కళాశాలకు వచ్చి వెళ్తున్న క్రమంలో వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. దసరా సెలవుల అనంతరం బాలిక సోమవారం కళాశాలకు వచ్చింది. అదే రోజు కృష్ణ ఆమెను కలిసి మాట్లాడినట్టు సమాచారం. తన స్నేహితుడి గదికి వెళ్దామని చెప్పడంతో నిరాకరించింది.
మంగళవారం ఉదయం 8 గంటలకు యథావిధిగా ఆమె ఇంటి నుంచి బయలుదేరి నల్లగొండకు చేరుకున్నది. సుమారు 8.30 గంటల ప్రాంతంలో సదరు బాలికను కలిసిన కృష్ణ.. మాయమాటలు చెప్పి డైట్ కళాశాల పకనే ఉన్న తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అకడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేశాడు. ఇదే విషయాన్ని నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
మైనర్ హత్యకు అతడి స్నేహితుడు సహకరించినట్టు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ శరత్‌చంద్రపవార్, డీఎస్పీ శివరాంరెడ్డి, ఇన్చార్జి సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నల్లగొండ టూటౌన్ ఎస్సై సైదులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, ఆధారాలు సేకరించారు. నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై లైంగిక దాడి, హత్య, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.