హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు నత్తను తలపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం గల రెండు జిల్లాల్లో అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం గల వికారాబాద్, నారాయణపేట రెండు జిల్లాలు అడ్మిషన్ల నమోదులో వెనుకంజలోనే ఉన్నాయి. విద్యాశాఖను సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డియే పర్యవేక్షిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నా పరిస్థితిని మెరుగుపరచలేకపోయారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 430 సర్కారు జూనియర్ కాలేజీలున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో 1.59లక్షల మంది సర్కారు బడుల నుంచి పదో తరగతి పరీక్షలు రాశారు. ఫస్టియర్‌లో 1,65,316మందిని చేర్పించాలని ఇంటర్ విద్యాశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 44.16% లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో నిరుడు సర్కారు జూనియర్ కాలేజీల్లో 1,933 మంది చేరితే, ఈ ఏడాది 1,854 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. నారాయణపేట జిల్లాలో నిరుడు 1,581 మంది సర్కారు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందితే.. ఇప్పటి వరకు 1,326 అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి. గ్రేటర్‌ను ఆనుకుని ఉండే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలతో కూడిన రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలు సైతం అడ్మిషన్ల నమోదులో వెనుకబడ్డాయి. రంగారెడ్డిలో నిరుడు 4,552 మంది చేరితే.. ఇప్పటి వరకు 3,968 మంది మాత్రమే చేరారు. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో నిరుడు 2,375 మంది చేరితే ఈ సారి 2,055 మంది మాత్రమే అడ్మిషన్లు పొందారు. నిరుటితో పోల్చితే ఈ జిల్లాల్లో అడ్మిషన్లు తగ్గడం గమనార్హం. కాగా, హనుమకొండ జిల్లా 85.45% అడ్మిషన్ల లక్ష్యాన్ని అధిగమించింది. పెద్దపల్లి 79.79%, హైదరాబాద్ 73.74% లక్ష్యాన్ని చేరుకున్నాయి.
జనగాం(35.63), మహబూబాబాద్ (32.40), రంగారెడ్డి (32.19), వరంగల్ (30.40), వికారాబాద్ (29.17), జోగులాంబ గద్వాల (27.91), సూర్యాపేట (27.34), నారాయణపేట (26.99), మేడ్చల్ – మల్కాజిగిరి (26.42), జయశంకర్భూపాలపల్లి (20.92).