హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోత్రిముఖ పోటీ నెలకొన్నది. 3,836 పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ జరిగే 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదు పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ మేరకు తొలి విడత పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎస్ఈసీ గురువారం రాత్రి విడుదల చేసింది. తొలి విడతలో మొత్తం 4,236 పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిల్లో 395 పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 8,095 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిలిగిన 3,836 గ్రామాల్లో ఈ నెల 11న పోలింగ్ జరుగనున్నది. బరిలో 13,127 మంది ఉన్నారు. మొత్తం 37,440 వార్డులకు ఎస్ఈసీ అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 9,480 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 9,626 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా 27,960 వార్డుల్లో ఈ నెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. బరిలో 67,893 మంది పోటీలో నిలిచారు. అంటే అటు పంచాయతీల్లో, ఇటు వార్డుల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తమకు కేటాయించిన గుర్తులను ప్లకార్డులుగా ప్రదర్శిస్తూ వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. కొందరు ఆటోలు, ఇత ర వాహనాలను ప్రచార రథాలుగా తీర్చిదిద్ది మైకులతో, అభ్యర్థి ఫొటో, గుర్తుతో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి చేయబోయే అభివృద్ధి పనులతో కూడిన హామీల కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కేవలం ఐదు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో ప్రతి ఓటరును పలుమార్లు కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తిరస్కరించిన నామినేషన్లపై అభ్యర్థుల అప్పీళ్ల గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. రెండో విడతకు సంబంధించి 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278.. 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు పరిశీలించిన అధికారులు చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాను ఆయా గ్రామాల్లో ప్రదర్శించారు. నామినేషన్ల తిరస్కరణపై గురువారం అభ్యర్థులు అప్పీళ్లకు వెళ్లారు. శుక్రవారం అభ్యర్థుల అప్పీళ్లను అధికారులు పరిష్కరించనున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తూ వారికి గుర్తులను కేటాయిస్తారు. రెండో విడతకు సంబంధించిన ఎన్నికల ప్రచారం కూడా శనివారం సాయంత్రం నుంచి షురూ కానున్నది. వారంరోజుల ప్రచారం అనంతరం 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత ఓట్లను లెక్కిస్తారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలను ప్రకటిస్తారు.
మూడో విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం రెండోరోజుకు చేరింది. 182 మండలాల్లోని 4,159 సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు బుధవారం నుంచి రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. బుధవారం ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? రెండో రోజైన గురువారం ఎన్ని వచ్చాయి? అనే వివరాలను ఎస్ఈసీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనున్నది. రెండు విడతల నామినేషన్ల తీరును పరిశీలిస్తే మూడో విడత కూడా చివరిరోజే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తం పంచాయతీలు:4,236
ఏకగ్రీవమైన స్థానాలు : 395
నామినేషన్లు రాని స్థానాలు: 5
ఉపసంహరించుకున్నఅభ్యర్థులు:8,095
పోలింగ్ జరిగే స్థానాలు: 3,836
బరిలో నిలిచిన అభ్యర్థులు: 13,127
మొత్తం వార్డులు: 37,440
ఏకగ్రీవమైన వార్డులు:9,480
ఉపసంహరించుకున్న అభ్యర్థులు:9,626
పోలింగ్ జరిగే వార్డులు: 27,960
బరిలో నిలిచిన అభ్యర్థులు: 67,893