హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు వెలవెలబోయింది. దీంతో పారిశ్రామికవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు జరిగిన సదస్సులను గుర్తుచేసుకుంటున్నారు. పదేండ్లపాటు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా కొనసాగింది. బయో ఏషియా సదస్సుతోపాటు ఐటీ సమ్మిట్, ఇండస్ట్రియల్ సమ్మిట్ల సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల అధినేతలు హాజరై పెట్టుబడులు పెట్టారు. కానీ, తాజాగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన గ్లోబల్ సమ్మిట్‌కు చెప్పుకోదగ్గ గ్లోబల్ కంపెనీలే కాదుకదా… జాతీయ స్థాయి కంపెనీలు కూడా రా లేదని పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన వివిధ సదస్సులకు పెద్దఎత్తున పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యేవారు. సాధారణంగా ఎక్కడికీ వెళ్లని టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా టీహబ్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం కేసీఆర్ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే, వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేసిన సదస్సుల్లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా సహా ప్రముఖులు పా ల్గొన్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ దేశాలకు చెందిన రాయబారులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌ను సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు. తాజాగా ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన గ్లోబల్ సమ్మిట్‌లో ట్రంప్ మీడియా డైరెక్టర్ ఎరిక్, అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ తప్ప చెప్పుకోదగ్గ ఒక్క బడా పారిశ్రామికవేత్త కూడా హాజరుకాకపోవడం పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.
