జయశంకర్ భూపాలపల్లి, నవంబర్15 (నమస్తే తెలంగాణ): ‘అసైన్డ్ భూమిలో అనుచరుడి పాగా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’అలో ప్రచురితమైన కథనం కలకలం రేపుతున్నది. బాధితులతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ కథనాన్ని సమర్థిస్తూ ఫోన్లు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, భూ దందాకు పాల్పడిన నేతపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మరిన్ని ఆధారాలు తామిస్తామంటూ సొంతపార్టీ నేతలే విన్నవిస్తున్నారు. పార్టీ ముఖ్యనేత మాత్రం తన అనుచరుడి భూదందాపై మౌనం వహిస్తూ అంతర్గతంగా సహకరిస్తూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భూదందాపై ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన కొందరు నేతలను కలిసి భూ ఆక్రమణ గురించి ఆరా తీసి వివరాలు సేకరించినట్టు సమాచారం. గణపురం మండల శివారులో అధికార పార్టీ నాయకుడు తన పేరున, తన బంధువు (మహిళ) పేరిట 10.33 ఎకరాలకు అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలు పొందాడు. పదేళ్ల క్రితం భూమి కొనుగోలు చేసినట్టు అనుచరుడు చెప్తున్నా ఎవరి దగ్గర కూడా కొనుగోలు చేసిన ఆధారాలు లేవు. ఆ నాడే కలెక్టర్.. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారు. 2014 నుంచి ఈ కేసు పెండింగ్‌లో ఉండగా, అధికారులు సైతం అలాగే పెట్టారు. తన వద్ద ఉన్న పట్టా పాస్‌పుస్తకాల ఆధారంగా అనుచరుడు కోర్టుకు వెళ్లగా.. రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని కౌంటర్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అనుచరుడి ఆగడాలు ప్రారంభమయ్యాయి.
కోర్టులో తమకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని, భూమి తమకు రెగ్యులరైజ్ చేయాలని రెవెన్యూ అధికారులపై తమ నేతతో ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకు అధికారులు అంగీకరించకపోవడంతో బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారగా సొంతపార్టీ నేతల నుంచే ముఖ్యనేత అనుచరుడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గణపురం మండలంలో ఇది ప్రభుత్వ భూమి అని, తమ నాయకుడు ఆక్రమించుకున్నాడని అందరూ కోడై కూస్తున్నా అధినేత మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.