Telangana Police | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): నేరాలను ముందుగానే పసిగట్టి నియంత్రించడం, వాటిని విఫలం చేయడంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కీలక పాత్ర. ఇందులో తెలంగాణ పోలీసులకు ఉన్న ట్రాక్ రికార్డు అంతాఇంతా కాదు. ఇతర రాష్ర్టాల్లో జరగబోయే సంఘవిద్రోహ చర్యలను సైతం ముందుగానే పసిగట్టి వాళ్లకు సమాచారాన్నిచ్చిన సందర్భాలున్నాయి. కానీ కొంతకాలంగా ఈ విభాగం నిద్రావస్థలోకి జారిందనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. కొంతకాలం కిందట హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేకంగా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ తర్వాత వారి కదలికలు, కార్యకలాపాలపై కించిత్తు నిఘా కూడా లేకుండా పోయింది. టాస్క్‌ఫోర్స్ విభాగం, స్థానిక పెట్రోలింగ్ విభాగాల నిఘా నిరంతరం కొనసాగేది. ప్రత్యేకంగా రికార్డుల నిర్వహణ ఉండేది. కానీ కొన్నినెలలుగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
రాత్రిపూట విజిబుల్ పోలీసింగ్ కూడా తగ్గడంతో రౌడీషీటర్లు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు శాఖలోని వివిధ విభాగాల మధ్యనే కాకుండా వివిధ ప్రాంతాల్లోని యంత్రాంగం మధ్య కూడా సమన్వయం కొరవడిందనే ఆరోపణలున్నాయి. మియాపూర్ ఘటన వెనక సమన్వయలోపపే కారణమని తెలుస్తున్నది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది వాహనాల్లో ఓవైపు వెళ్తున్నారనే సమాచారం నిఘా విభాగం ముందుగా గుర్తించి పోలీస్స్టేషన్ల మధ్య సమాచారాన్ని బదిలీ చేసి అప్రమత్తం చేసిఉంటే ఐదారు వేల మంది ఒకచోట పోగయ్యే అవకాశం ఉండేది కాదు. చిలకలగూడ, ఉప్పల్, మేడ్చల్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో దొంగతనాలు జరిగిన తర్వాతగానీ ఫలానా గ్యాంగులు నగరంలోకి వచ్చాయని పోలీసులు నిర్ధారణకు రాలేకపోయారు.
ముందుగానే ఆయా గ్యాంగుల కదలికలను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసిన దాఖలాల్లేవు. అపార్టుమెంట్లు, పట్టపగలే దుకాణాల్లోకి చొరబడి చోరీలకు తెగబడ్డారంటే ముందుగా రెక్కీ నిర్వహించకుండా సాధ్యంకాదు. నిఘా విభాగం అప్రమత్తంగా ఉంటే కొత్త గ్యాంగులపై పోలీసులు కొరఢా ఝుళిపించే వీలుండేది. నిఘా విభాగం వైఫల్యంతోనే చివరికి రాత్రివేళల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితులు వచ్చాయి. నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 1950 మంది రౌడీషీటర్లున్నారని అంచనా. వీరిలో ఒక్క బాలాపూర్ పరిధిలోనే 54 మంది ఉన్నారు. ఇటీవల 24 గంటల వ్యవధిలోనే నగరంలో ఐదు హత్యలు జరిగాయి. ఆసిఫ్‌నగర్‌లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే వరుసగా మూడు హత్యలు జరిగాయి. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం లేకపోవడం గమనార్హం.
మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు పంచుతున్నారంటూ సామాజిక మాద్యమాల్లో వైరలైంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం భూముల దగ్గరికి పోటెత్తారు. గత శుక్రవారంతో మొదలైన ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగింది. చివరకు రాళ్లదాడి-లాఠీచార్జి వరకు వెళ్లింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఐదారు వేల మంది వచ్చారు. ఒక సమాచారాన్ని అందరూ చేరవేసుకొని వేలాది వాహనాల్లో వచ్చినా నిఘా విభాగం ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయిందనే ప్రశ్న తలెత్తుతున్నది.