Integrated Schools | హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గురుకుల విద్య దేశానికే తలమానికంగా నిలిచింది. ఎంతో మంది నిరుపేద విద్యార్థుల భవితకు బాటలు పరిచింది. ఇందులో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ప్రవేశాలు పొంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా రాణిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో 294గా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల సంఖ్యను విడతల వారీగా 1022కు విస్తరించింది. ఇప్పుడు ఆయా గురుకులాలకు శాశ్వత భవనాలను నిర్మించి, మౌలికవసతులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, డిమాండ్ ఉన్న చోట మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొత్తవాటి ఊసెత్తలేదు. ప్రస్తుతం వివిధ చోట్ల ఉన్న గురుకులాలనే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్’ పేరిట ఒకే సముదాయంలో నిర్మించేందుకు పూనుకున్నది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ స్కూళ్లకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే కులసంఘాలు, ప్రజాసంఘాలు, విద్యావేత్తలు, తెలంగాణ మేధావులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకుల విద్య నిర్వీర్యమైపోతుందని అందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ వర్గాలకు మళ్లీ ప్రాణం పోసేందుకే ఈ నిర్ణయం దోహదం చేస్తుందని నిప్పులు చెరుగుతున్నారు.
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ అంటూ సీఎంతో మొదలుకొని కాంగ్రెస్ పెద్దలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ స్కూళ్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. ఈ స్కూళ్లలో ఉండే వసతులు ఏమిటి? ప్రవేశాలు ఎలా కల్పిస్తారు? ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు విద్యాబోధన చేస్తారు? ఎవరి ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తారు? తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేయలేదు. ఇక ఇప్పటివరకు బయట వినిపిస్తున్న దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని గురుకులాలను ఒకే సముదాయంగా ఏర్పాటు చేస్తారట. కామన్ కాంప్లెక్స్, గ్రౌండ్, కిచెన్, డార్మెటరీ, డైనింగ్ తప్ప అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఆయా సొసైటీల వారీగానే ఉంటుందని ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అలాయితే మరి ఒకే చోట కలిపి నిర్మించడం ఎందుకో అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతోనే ఒకే కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ వాస్తవంగా ప్రస్తుతమున్న గురుకులాల్లోనూ అన్నివర్గాల విద్యార్థులు కలిసే చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర గురుకులాల్లో 70 శాతం సీట్లు ఆయావర్గాలకు, మిగిలిన 30 శాతం సీట్లు ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు కొత్తగా ఒకే చోట అన్ని గురుకులాలను నిర్వహించడమంటే ఏదో మర్మమున్నదని విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ హయాంలో అన్ని గురుకులాలను కలిపి ఇలాగే ఇంటిగ్రేటెడ్ గురుకులాలని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారని గుర్తుచేస్తున్నారు. కానీ విద్యావేత్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో విరమించుకున్నారని, అ దొక విఫల ప్రయోగమని తెలుపుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్వహణ అంతా అషామాషీ కాదని, క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకే సముదాయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను నిర్వహించడమంటే కత్తిమీద సాములాంటిదని తెలుపుతున్నారు. విద్యార్థుల మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక గురుకులంలో 640 మంది విద్యార్థులను మేనేజ్ చేయడమే కష్టంగా మారిందని, అలాంటప్పుడు ఒకే సముదాయంలో 2400 మంది విద్యార్థులను మేనేజ్ చేయడం కత్తిమీద సాములా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు కంటే ప్రస్తుతమున్న గురుకులాలను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో గురుకులాలు రాత్రికి పుట్టినవి కావు. పీవీ నర్సింహారావు హయాంలోనే పురుడుపోసుకున్నవి. ఇక అయితే ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ ప్రాంతం విద్యారంగంలోనూ తీవ్ర వివక్షకు గురైంది. ఈ నేపథ్యంలోనే స్వరాష్ట్రంలో తెలంగాణ విద్యారంగంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందించాలని సంకల్పించారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ దిశగా వడివడిగా బలమైన అడుగులు పడ్డాయి. స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి క్రమక్రమంగా గురుకులాల సంఖ్యను పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం 294 గురుకులాలు మాత్రమే ఉండగా, అందులోనూ 5-10వ తరగతి వరకు మాత్రమే విద్యనందిచేవారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌ను నిర్వహించగా అవి కూడా అంతంతమాత్రమే కొనసాగేవి. అరకొర హాస్టళ్లలో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపిన దుస్థితి. స్వరాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేశారు. గురుకుల విద్యను మరోమెట్టుపైకి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచీలా నిలిపారు. గురుకుల విద్య ముఖచిత్రాన్నే మార్చివేశారు. సీట్లు లేక బోసిన గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడే పరిస్థితికి తీసుకువచ్చారు. అయితే కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాం అని బాహాటంగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆచరణలో చేసి చూపుతున్నారని, గురుకులాలపై కేసీఆర్ వేసిన ముద్రను చెరిపేయాలనే కక్షతో బడుగుబలహీనవర్గాల పిల్లలను ఉన్నతవిద్యకు దూరం చేసే కుట్రకు తెరలేపారని విద్యావేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని ప్రజా, కుల సంఘాలు మండిపడుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గ కేంద్రాల్లో తొలిదశలో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్స్ భవన నిర్మాణాలకు నేడు (శుక్రవారం) ప్రభుత్వం శంకుస్థాపన చేయనున్నది. అయితే ఈ శంకుస్థాపనలు జరిగే వాటిల్లో ఎక్కువ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చెందినవే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పాల్గొంటారు. శంకుస్థాపన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి గురువారం సమీక్ష నిర్వహించారు. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో సూళ్ల నిర్మాణాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ సూళ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. తొలిదశలో కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అంధోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు సీఎస్ వెల్లడించారు.
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్’ విధానం ఆచరణలో అసాధ్యం. ఒకే సముదాయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ గురుకులాలను నిర్వహించడం కాదు.. ఆయా సొసైటీల సం ఖ్యకు ఉన్న రేషియో ప్రకారం ఒకే సొసైటీ లో ఆయా వర్గాల వి ద్యార్థులకు అడ్మిషన్లను కల్పించాలి. అప్పుడు విద్యార్థుల మధ్య సఖ్య త పెరుగుతుంది. కానీ అలాకాకుండా ఒకే సముదాయంలోనే వేర్వేరుగానే నిర్వహిస్తే కులభావజాలం మరింతగా బలబడుతుంది. అంతిమంగా గురుకులవిద్యనే ప్రశ్నార్థకమవుతుంది.