కరీంనగర్ : సమీకృత మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలతో సమీకృత మార్కెట్ల నిర్మాణం, ఫుట్ పాత్ ల ఆక్రమణలు, హరితహారం, ఐలాండ్, రానున్న వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్, జమ్మికుంట హుజరాబాద్, చొప్పదండి,కొత్తపల్లి పట్టణాలలో చేపట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్ష కాలంలో మురికినీరు, కాలువల నీరు బీటీ రోడ్లపై ప్రవహించడం వల్ల రోడ్లు పాడై పోతున్నాయన్నారు.
మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలన్నారు.
కరీంనగర్, సిరిసిల్ల రోడ్డును రూ.80 కోట్ల తో పూర్తి చేస్తున్నామని, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్లో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించేలా ఎన్టీఆర్ విగ్రహం నుంచి కమాన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మెయిన్ ఎంట్రన్స్ అద్భుతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు.
గుత్తేదారులు సమీకృత మార్కెట్ల ను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఐలాండ్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల వద్ద పార్కింగ్ సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వైకుంఠధామం లను జిల్లాలో వంద శాతం పూర్తి చేయాలని మంత్రి అన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, తదితరులు పాల్గొన్నారు.