హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఎస్బీఐ కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ ద్వారా కోటి రూపాయల బీమాను ఉద్యోగులకు వర్తింపజేస్తారు. విద్యుత్తు సంస్థల్లోని 51,868 మందికి ఈ బీమా అందుతుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ ప్రమాద బీమా రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్బీఐ జీఎం రవికుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
రూ. కోటి ప్రమాద బీమాపై హర్షం
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమాపై తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ హర్షం వ్యక్తంచేసింది. ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని స్వాగతించింది. డిప్యూటీ సీఎం భట్టిని జేఏసీ చైర్మన్ జీ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకర్‌రావు, నేతలు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.