Congress Govt | యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. హోంగార్డులు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు వర్తింపజేసే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. పథకం గడువు ముగిసి నెల కావస్తున్నా ఇప్పటివరకు రెన్యువల్ చేయకుండా చోద్యం చూస్తున్నది. అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదించకుండా పెండింగ్లో పెట్టింది. వివిధ ప్రమాదాల బారిన పడి ఎన్నో కుటుంబాలు తమ ఇంటి పెద్దను పోగొట్టుకొని రోడ్డున పడుతున్న ఘటనలు అనేకం కండ్లెదుటే కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబసభ్యులను ఆర్థికంగానైనా ఆదుకునేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాన్ని (సోషల్ సెక్యూరిటీ స్కీమ్) తీసుకొచ్చింది. 2015లో మేడే సందర్భంగా కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఆటో కార్మికులు, హోంగార్డులు, జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా పథకానికి అప్పటి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీని కింద రాష్ట్రంలో సుమారు 12 లక్షల మంది డ్రైవర్లు, 20 వేల మంది హోంగార్డులు, మరో 20 వేల మంది జర్నలిస్టులు లబ్ధిదారులుగా ఉన్నారు.
తొలి ఏడాది ఒక్కొక్కరికి రూ.50 చొప్పున అందరికీ రూ.5 కోట్ల ప్రీమియాన్ని ఆనాటి కేసీఆర్ సర్కారు బీమా సంస్థలకు చెల్లించింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అప్పటి ప్రభుత్వం ఏటా గడువు ముగియగానే క్రమం తప్పకుండా పథకాన్ని రెన్యువల్ చేస్తూ వచ్చింది. నిరుడు ఆగస్టు 7న ఇచ్చిన జీవో 22 ప్రకారం అదే ఏడాది ఆగస్టు 5 నుంచి 2024 ఆగస్టు 4 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఆ పథకం గడువు ముగిసినా ఇప్పటి వరకు పొడిగించలేదు. దీనిపై కార్మిక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనల ఫైల్ పంపినా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు. దీంతో ఇటీవల దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయి ఉంటే బీమా వర్తించని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ఆయా కుటుంబాలు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కోల్పోనున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీమా ప్రీమియంను రెన్యువల్ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో లక్షల మందికి ధీమా!
గడిచిన తొమ్మిదేండ్లలో ఆటో కార్మికులు, జర్నలిస్టులు, హోంగార్డులకు సామాజిక భద్రతా పథకం ఎంతగానో ఉపయోగపడింది. లక్షలాది కుటుంబాలకు ధీమా కల్పించింది. ఇప్పటివరకు తెలంగాణలో 913 కుటుంబాలకు అండగా నిలిచింది. ఆయా నామినీల ఖాతాల్లో రూ.45.65 కోట్లు బీమా క్లెయిమ్ సొమ్ము జమయ్యింది. కొవిడ్ సమయంలో అత్యధికంగా 222 కుటుంబాలకు ఈ బీమా క్లెయిమ్ సొమ్ము అందింది. 2022-23లో 131 మందికి, 2023-24లో 91 మందికి బీమా ఫలాలు అందాయి.
ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలి
ప్రమాదంలో చనిపోతే కుటుంబాలను ఆదుకోవడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడమే లేదు. బీమా గడువు ముగిసి నెలకావస్తున్నా, ఇంకా రెన్యువల్ చేయలేదు. ఈ మధ్యలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితి ఏమిటి? లక్షలాది మందికి ధీమా కల్పించే బీమాను నిర్లక్ష్యం చేయడమేంటి? ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలి.
– ఆర్ల సత్తిరెడ్డి, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకుడు, యాదాద్రి భువనగిరి జిల్లా