హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో చెప్పడానికి తాజాగా అసెంబ్లీ పరిణామాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ఆవరణలోనే జనరేటర్ పెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం. అసెంబ్లీలో నదీ జలాల అంశంపై శనివారం పీపీటీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభు త్వం నిర్ణయించగా, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్యాహ్నం తర్వా త అందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కరెంట్ ఎప్పుడుపోతుందోననే భయంతో అధికారులు ముందుగానే భారీ జనరేటర్‌ను అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేశారు. ప్రజెంటేషన్ మధ్యలో పవర్‌కట్ అయితే సర్కార్‌కు ఇంకా అవమానకరం అని భావించిన యంత్రాంగం జనరేటర్ తెచ్చిపెట్టింది. రాష్ట్రం మొత్తానికి వెలుగులు అందిస్తున్నామని చెప్పుకొనే ప్రభుత్వం, స్వతహాగా ప్రజెంటేషన్ కోసం కరెంట్లైన్లను నమ్మలేక జనరేటర్లపై ఆధారపడటం వైఫల్యానికి అద్దం పడుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మాకు ఇచ్చే కరెంట్ విషయంలో లేని జాగ్రత్త, మీ ప్రజెంటేషన్ల కోసం ఎందుకు?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అప్రకటిత కోతలపై అన్నదాతల ఆగ్రహం
అసెంబ్లీలో జనరేటర్లు పెట్టి హైటెక్ హం గామా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ క్షేత్రస్థాయి లో రైతుల పరిస్థితిని మాత్రం పట్టించుకోవ డం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక, సాగునీరు అందక రైతులు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. సరిగా విద్యుత్ సరఫరా లేక మోట ర్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే గంటల తరబడి కరెంట్ కోతలు విధిస్తుంటే, ఇక గ్రామాల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వాపోతున్నారు. అసెంబ్లీ ఆవరణలో జనరేటర్ ఏర్పాటు చేయడంపై సామాన్య ప్రజలు మొదలు ప్రతిపక్ష నాయకుల వరకు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. పంట సాగులో కరెంట్ కష్టాలు ఎంతగా ఉన్నాయో ఈ రకంగానైనా తెలుసుకున్నారని, ఇప్పటికైనా వాటిని తీర్చే ప్రత్యామ్నాయం చూపాలని అన్నదాతలు పేర్కొంటున్నారు.