హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని, తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వినూత్నంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలోని రహదారులపై ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో శనివారం ఆయన ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్‌లు నిర్వహించారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌కు స్పష్టం చేశారు.
ప్రయాణికులకు సంధించిన అంశాలపై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా వ్యవహరించాలని, కిందిస్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్ల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్లలో కార్మికులకు ఈ నెల 17లోగా టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం లాంటి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని తెలిపారు.
ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లెందు లాంటి కొన్ని డిపోలు ఎందుకు నష్టాల్లో నడుసున్నాయన్నదానిపై ఆర్ఎంలు, డిపో మేనేజర్లు సమీక్షించుకోవాలన్నారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా రెండో మంగళవారం అన్ని డిపోల్లో గ్రీవెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఆ కార్యక్రమాలకు డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.