సిద్దిపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి, సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నదని, ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కైనా, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన సందర్భమైనా సిద్దిపేటకు పేగు బంధం ఉన్నదని గుర్తుచేశారు. శుక్రవారం సిద్దిపేటలోని రంగధాంపల్లిలో అమరవీరుల స్తూపానికి పూలువేసి నివాళులర్పించారు.
అనంతరం వరంగల్ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1500 మంది యువత పాదయాత్ర చేపట్టగా హరీశ్ జెండా ఊపి ప్రారంభించారు. వారితో కలిసి దాదాపు 6 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మీరు చేస్తున్న ఈ పాదయాత్ర రేపటి బీఆర్ఎస్ విజయ యాత్ర కాబోతున్నది’ అని పేర్కొన్నారు. పాదయాత్రగా బయలుదేరిన విద్యార్థి యువ మిత్రులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
అంతకు ముందు ఉగ్రదాడి మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధ్దాంజలి ఘటించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పారని, అదే పద్ధతిలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్, ప్రజలందరికీ తెలంగాణ ఎందుకు అవసరమో బోధించారని గుర్తుచేశారు. సమైక్యవాదులపై, ఢిల్లీ పెద్దలపై పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. 1969లో పోలీసుల కాల్పుల్లో 369 మంది చనిపోయారని, ఆనాటి హింసను దృష్టిలో పెట్టుకొని మలిదశ ఉద్యమంలో గాంధీ చూపిన బాటలో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు నడిపారని చెప్పారు.
14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల పాలన.. ఏడాదిన్నరగా ప్రతిపక్షం. ఇలా ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో ధాన్యం ఉత్పత్తి, తలసరి ఆదాయం, జీఎస్డీపీలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని కొనియాడారు. డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు.
‘ఈ రోజు యువత చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలె..ఆ రోజు లంకలో రావణుడు చేసే అరాచకాలను ఎదిరించేందుకు రామదండు కదిలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించేందుకు ఈ గులాబీ దండు కదిలింది’ అని హరీశ్ చెప్పారు. పాదయాత్రలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను వివరించాలని సూచించారు. మూడు రోజులపాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గులాబీ దండు రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కదిలిందని చెప్పారు. 44 డిగ్రీల ఎండను కూడా లెక చేయకుండా 1500 మంది 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ కోసం స్వచ్ఛందంగా తరలివచ్చినందుకు అభినందించారు.