High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చట్టవ్యతిరేకంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒక్కరోజే నోటీసు ఇవ్వడం, విచారణ చేపట్టడం, అదీ రెండో శనివారం కావడం, ఆ తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపట్టడం హైడ్రాకు పరిపాటిగా మారిందని ఆక్షేపించింది. గతంలో ఇదే హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు ఈ వైఖరి విరుద్ధమని పేరొన్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగిలోని తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండానే అందులోని షెడ్డును కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఏ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా నోటీసులు జారీ చేసిందని, దీనికి సమాధానంగా భూమార్పిడి ప్రొసీడింగ్స్, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు వంటి వి వరాలను హైడ్రాకు సమర్పించినట్టు పిటిషనరు తరఫు న్యాయవాది తెలిపారు. వివరాలను పరిశీలించకుండా, ఫిర్యాదు చేసిన వారితోపాటు పిటిషనర్‌ను పిలిచి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా షెడ్డును కూల్చివేశారని పేర్కొన్నారు.
నోటీసులు ఇచ్చిన తర్వాత, పత్రాలు సమర్పించడానికి హైడ్రా 24 గంటలు కూడా సమయం ఇవ్వడం లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. ముందురోజు నోటీసు ఇచ్చి, తర్వాత రోజుకే గడువు ఇచ్చి, ఆ వెంటనే కూల్చివేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. హైడ్రా ప్రొసీడింగ్స్ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలాగని, హైకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. ముత్తంగిలో షెడ్డు కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.